అందువల్లే అవకాశాలు తగ్గాయనే ప్రచారం నిజం కాదు !

“మహానటి” చిత్రం తరువాత కీర్తి సురేష్  రేంజ్ మారిపోయింది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో నటి కీర్తి సురేష్  పేరే ప్రముఖం గా వినబడుతోంది . ‘మహానటి’ సావిత్రినే వెండితెరపై మరపించిన కీర్తి సురేష్  ఆ తరువాత తెలుగులో ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదు. అయితే అందుకు కారణాన్ని కూడా కీర్తి వివరించింది…. ‘తమిళంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉంద’ని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా “సర్కార్”, విశాల్‌తో “సండైకోళి–2”, విక్రమ్‌ సరసన “సామి” చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా తెలుగులో “ఎన్‌టీఆర్‌” బయోపిక్‌లో మరోసారి సావిత్రిగా జీవించే అవకాశం ఈ బ్యూటీనే వరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కీర్తి సురేష్ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘పక్కింటి అమ్మాయి’గానే కనిపించింది.ఎలాంటి లిప్‌ లాక్‌  సన్నివేశాల్లోనూ, గ్లామరస్‌ పాత్రల్లోనూ నటించలేదు. ముద్దుసన్నివేశాల్లో నటిస్తారా? అని ఆమెను అడిగితే…   తాను నటించడానికి సిద్ధం అయినప్పుడే …. “కమర్శియల్‌ చిత్రాల హీరోయిన్లకు గ్లామర్‌ విషయంలో  హద్దులు ఉండకూడదు…   ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తయారుగా ఉండాలి… ముద్దు సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటే ‘నో’ అని చెప్పకూడదు” అని చెప్పారంది. అయితే ఇంత వరకూ తాను నటించిన ఏ చిత్రంలోనూ అలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదని చెప్పింది. తాను నటించిన చిత్రాల దర్శకులెవరూ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించమని బలవంతపెట్టలేదని చెప్పింది. ఈ విషయంలో తాను లక్కీనేనని పేర్కొంది. నిజానికి తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది. కారణం తనకు కాస్త సిగ్గు ఎక్కువేనని అంది. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికే బిడియ పడతానని చెప్పింది. తాను గ్లామరస్‌గా నటించడానికి నిరాకరించడం వల్లే ‘మహానటి’ చిత్రం తరువాత  అవకాశాలు తగ్గాయనే ప్రచారంలో నిజం లేదని, తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నానని కీర్తి సురేష్ పేర్కొంది.
శింబుతో దర్శకుడు వెంకట్‌ ప్రభు చిత్రం
కీర్తి సురేష్ ‘మహానటి’  సక్సెస్‌ తర్వాత ఒక్క సినిమా కూడా కొత్తగా సైన్‌ చేయలేదు  . తమిళంలో విక్రమ్‌తో చేస్తున్న ‘సామి 2 ’, విశాల్‌తో చేస్తున్న ‘పందెం కోడి 2’… ఈ రెండూ కూడా ‘మహానటి’కి ముందు కమిట్‌ అయిన సినిమాలే. ఈ రెండు సినిమాల తర్వాత ఏంటి? అంటే…. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త ప్రకారం శింబుతో దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్  పేరును పరిశీలిస్తున్నారట. ఈ చిత్రానికి ‘అదిరడి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఒకవైపు చెన్నై ఫిల్మ్‌నగర్‌లో టైటిల్, హీరోయిన్‌ గురించి జోరుగా వార్తలు షికారు చేస్తుంటే, దర్శకుడు వెంకట్‌ ప్రభు మాత్రం …టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. టైటిల్‌ మాత్రం ‘అదిరడి’ కాదు. కొత్త టైటిల్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు.