సైడ్‌ ఎఫెక్ట్స్‌కి సిద్ధపడే ఈ రంగంలోకి వచ్చా !

సెలబ్రెటీ హోదా వచ్చాక సామాన్యుల్లా బయట తిరగలేరు. చిన్న చిన్న కోరికల్నీ పణంగా పెట్టాల్సి వస్తుంది. ‘సినిమా వాళ్ల జీవితాలకేం… వాళ్లు ఏం ముట్టుకున్నా బంగారమే’ అనుకోవడానికి వీల్లేదు. ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి. వాళ్లేం చేసినా అందులో తప్పుల్ని పట్టుకోవడానికి భూతద్దం పట్టుకుని మరీ పరుగులు తీస్తుంటుంది సమాజం. ‘‘నేనేం నా కోరికల్ని వదులుకోలేదు. షాపింగులకు ఇది వరకటిలానే తిరిగేస్తున్నా. సినిమా తార అనే హోదా నాకెప్పుడూ బరువు అనిపించలేదు’’ అంటోంది కీర్తి సురేష్‌. ‘‘మంచి చెడు ఎక్కడైనా ఉంటాయి. ఒకటి కావాలనుకుంటే, రెండోదీ స్వీకరించాల్సిందే. సైడ్‌ ఎఫెక్ట్స్‌ని ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈ రంగంలోకి వచ్చా. అందరిలా సినిమా తారలు బయటకు వెళ్లలేరు. ఏది కావాలనుకుంటే అది చేయలేరు. జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అందులోనూ ఓ కిక్‌ ఉంటుంది. దాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తుంటాను. చిన్న చిన్న ఇబ్బందులు ఎవ్వరికైనా తప్పవు’’ అని చెప్పింది కీర్తి సురేష్.
 
మణిరత్నం దర్శకత్వంలో
గత ఏడాది మహానటి చిత్రంలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె తమిళ చిత్రసీమలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో నటించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకుంది కీర్తిసురేష్. వివరాల్లోకి వెళితే…మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ పేరుతో భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చోళుల రాజవంశానికి చెందిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, జయం రవితో పాటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మోహన్‌బాబు కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను ఓ ప్రధాన పాత్రకు ఎంచుకున్నారట. కథాపరంగా ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నది. మణిరత్నం దర్శకత్వంలో నటించడం తన కల అని చాలా సందర్భాల్లో ప్రకటించింది కీర్తిసురేష్. తాజా ఆఫర్‌తో ఆమె కోరిక నిజమైందని తమిళ సినీవర్గాలంటున్నాయి.
 
మహిళా ప్రధాన ఇతివృత్తంతో
కథానాయిక ప్రాధాన్యంతో కూడిన చిత్రాలకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు కీర్తిసురేష్‌.‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నారు నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌ కోనేరు నిర్మాత. కుటుంబం నేపథ్యంలో వినోదం, సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. రూ.50 లక్షల వ్యయంతో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అందులో కీర్తిసురేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌, నదియా, నరేష్‌, భానుశ్రీ మెహ్రా తదితరులు పాల్గొన్నారు. తదుపరి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్టు నిర్మాత తెలిపారు. దసరా సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు