ఓటీటీ బాటలో వరుసగా కీర్తి సురేష్ చిత్రాలు

కీర్తి సురేష్ ‘మ‌హాన‌టి’ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుని ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. ఆమె న‌టించిన ‘మిస్ ఇండియా’ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ‘రంగ్ దే’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాల‌తో బిజీగా ఉంది. మహేష్ బాబు తో ‘స‌ర్కారు వారి పాట’లో, రజనీకాంత్ తో ‘దర్బార్’ లోనూ చేస్తోంది. ఇటీవ‌ల గ్లామ‌రస్ చిత్రాల‌తో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ వ‌స్తున్న కీర్తి లీడ్ రోల్‌లో తెర‌కెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం కొద్ది రోజుల క్రితం ఓటీటీలో విడుద‌ల కాగా.. ఇప్పుడు మెయిన్ లీడ్‌లో నటించిన ‘మిస్ ఇండియా’ తో పాటు ఆమె చిత్రాలు మరికొన్ని కూడా ఓటీటీ బాట‌ప‌ట్ట‌నున్నాయి. నరేంద్ర నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘మిస్ ఇండియా’ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా..ఇప్పుడు ఒక పాట కూడా విడుదల చేసారు.

‘మిస్‌ ఇండియా’ పేరుతో చాయ్‌ వ్యాపారం… గొప్ప వ్యాపారవేత్తగా రాణించాలని స్కూల్‌రోజుల నుంచే కలలు కంటుంది సంయుక్త. తన మధ్యతరగతి నేపథ్యాన్ని చూసి నిరాశ చెందకుండా లక్ష్యసాధనకు ధైర్యంగా ముందడుగు వేస్తుంది. ఎన్నో సవాళ్లను అధిగమించి ‘మిస్‌ ఇండియా’ పేరుతో చాయ్‌ వ్యాపారాన్ని ఆరంభిస్తుంది. అయితే ఆ రంగంలోని ఓ పెద్దమనిషి సంయుక్తకు అడ్డుగా నిలుస్తాడు. ఈ క్రమంలో సంయుక్త ఏం చేసింది? ‘మిస్‌ ఇండియా అంటే ఓ పేరు కాదు..బ్రాండ్’‌ అంటూ ప్రత్యర్థులకు సవాలు విసిరిన ఆ ధీరోదాత్త మహిళ చివరకు ఏం సాధించిందో తెలుసుకోవాలంటే.. ‘మిస్‌ ఇండియా’ సినిమా చూడాల్సిందే’ అంటున్నారు దర్శకుడు  వై.నరేంద్రనాథ్‌.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మించారు. నవంబర్‌ 4న డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా తెలుగులో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ… ‘తన కలల్ని సాకారం చేసుకోవడానికి ఓ మధ్యతరగతి యువతి సాగించిన పోరాటమే ఇతివృత్తంగా అందరిని ఆకట్టుకునే చిత్రమిది. నేటితరం మహిళలందరికి స్ఫూర్తినిస్తుంది’ అని చెప్పింది. జగపతిబాబు, నదియా, రాజేంద్రప్రసాద్‌, వీకే నరేష్‌, భానుశ్రీమెహ్రా, పూజిత పొన్నాడ, కమల్‌కామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం.

భారీ రెమ్యున‌రేష‌న్ తో మెగాస్టార్ తో… చిరంజీవి త‌మిళ సూప‌ర్ హిట్ ‘వేదాళ‌మ్’ రీమేక్ లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్ లో రానున్న ఈ మూవీలో చిరంజీవి సోద‌రి పాత్ర‌లో కీర్తిసురేశ్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే కీర్తిసురేశ్ ఈ చిత్రం కోసం భారీ మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంద‌న్న న్యూస్ ఫిలింన‌గర్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కీర్తిసురేశ్ డిమాండ్ ను మేక‌ర్స్ అంగీక‌రించార‌ట‌. ముందుగా ఈ పాత్ర కోసం సాయిప‌ల్ల‌విని అనుకున్నారు. కానీ సాయిప‌ల్ల‌వి కొంత చిన్న వ‌య‌స్సుగా క‌నిపించడంతో..కీర్తిసురేశ్ ను ఒకే చేసారని టాక్. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 జన‌వ‌రిలో ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానుంది . మొత్తానికి త‌క్కువ టైంలోనే కీర్తిసురేశ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే అరుదైన అవ‌కాశం కొట్టేయ‌డ‌మే కాకుండా..భారీ రెమ్యున‌రేష‌న్ కూడా సాధించడం గొప్ప విషయమేనంటున్నారు పరిశీలకులు.