నా విజయ రహస్యం అదే !

కీర్తిసురేష్ ఇటీవల కొన్నికమర్షియల్ చిత్రాల్లో నటించినా ప్రస్తుతం ఆమె నటజీవితం నిదానంగానే నడుస్తోంది. ఆమె ఎన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా ‘మహానటి’ ఆమె సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుంది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా ‘మహానటి’ చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. 
 
కీర్తిసురేష్ మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తోంది. ఇక తమిళంలో ‘సర్కార్‌’ చిత్రం తరువాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తిసురేష్ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.ప్రతి రోజు షూటింగ్‌ సెట్‌లో వందమందిని మనం గురువులుగా చూడవచ్చునని అంది. వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్‌మెన్‌ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పింది.
ఇక నటీనటులు.. వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది.‘మహానటి’చిత్రం తరువాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం ఇదేనని కీర్తిసురేష్ చెబుతోంది
బాలీవుడ్‌లో రెండు సినిమాలు
కీర్తిసురేష్ తెలుగులో ‘మహానటి’ తర్వాత తెలుగులో పలు ఆఫర్లు వచ్చినా ఆచి తూచి వ్యవహరించి ఇటీవల ఒక చిత్రాన్ని మొదలుపెట్టింది. ఇక తమిళంలో క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోయిన్‌గా ఎంపికైంది . సూపర్‌స్టార్ రజనీకాంత్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కీర్తి హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సౌత్‌లో బిజీగా ఉన్న కీర్తిసురేష్ బాలీవుడ్‌లో రెండు సినిమాలకు కమిట్ అయింది. అజయ్ దేవగణ్ నటించబోతున్న ఒక బయోపిక్‌లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. అదేవిధంగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించబోతున్న మూవీలో కూడా కీర్తిసురేష్ హీరోయిన్‌గా ఎంపికైంది. రెండు క్రేజీ ప్రాజెక్టులతో బాలీవుడ్‌కు వెళ్తున్న ఈ అమ్మడికి అక్కడ సక్సెస్‌లు దక్కితే మన పరిస్థితి ఏంటో !