ఆ పాత్రకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది !

కీర్తి సురేష్ కు  ‘మహానటి’ తర్వాత ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే కీర్తి మాత్రం వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే స్టార్‌ హీరోయిన్‌ కీర్తి.. ఓ డేరింగ్‌ స్టెప్‌ వేసింది. సోదరి పాత్రకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ హీరోగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా “అన్నాతే”. ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ ముద్దుల చెల్లెలిగా ఓ కీలక పాత్రలో నటించారు. ఇటీవల తన షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. సినిమాను మొత్తం మలుపు తిప్పే ప్రధానపాత్ర కావడంతోనే కీర్తి ఈ చిత్రం  చేయడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది

విజయ్ తో ముచ్చటగా మూడవసారి!… కీర్తి సురేష్‌ దక్షిణాదిన వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారిగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సరసన జత కట్టనుంది. మరోవైపు ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘అన్నాతై’ సహా మోహన్ లాల్ ‘మరక్కర్’, సెల్వరాఘవన్ ‘సాని కాయిదం’, మలయాళంలో ‘వాశి’  సినిమాలలో  కీర్తి నటిస్తోంది. అయితే తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ టాలీవుడ్‌లో  స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. తెలుగులో నటించనున్న తొలి సినిమాకే విజయ్‌ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జంటగా కీర్తి సురేష్‌  నటిస్తుందని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారు. డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నట్లు సమాచారం. కీర్తి న‌టించే తొలి ‘ పాన్ ఇండియా’ సినిమా ఇదే అవుతుంది.

అతిపెద్ద ఆయుధం ఇదే!… కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా సహకరించాలని కీర్తి సురేష్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే, కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, చైతన్యం కలిగించేందుకు సినీ నటులు కూడా తమవంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఇదే విషయంపై ఇటీవల ఓ సంద‌ర్భంలో కీర్తి మాట్లాడుతూ… ‘ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు. అత్యవసర పనులు ఉంటే.. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటపుడు ఖచ్చితంగా డబుల్‌ మాస్క్‌ ధరించండి. సామాజిక భౌతికదూరాన్ని పాటిస్తూ, చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.  ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలి. ప్రధానంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కరోనా వైరస్‌పై సాగుతున్న యుద్ధంలో విజయం సాధించేందుకు అతిపెద్ద ఆయుధం ఇదే. కరోనా పై విజయం సాధిద్దాం!..’ అన్నారు.