ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా…

“నాకంతా తెలుసన్న గర్వం మాత్రం లేదు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా నడుచుకుంటాను”…అని అంటోంది ‘మహా నటి’ కీర్తి సురేష్. కీర్తి సురేశ్‌ ఇటీవల మీడియాతో తన భావాలను పంచుకుంది… “తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉంటుంది. అయితే, అవసరంలేనప్పుడు మనకు తెలిసినవన్నీ బయటకు చెప్పడం నాకు నచ్చదు. ఇక పనిలేకుండా ఖాళీగా కూర్చోవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు సినిమా రంగంలో అవకాశాలు వరించడం గొప్ప విషయమే. కనుక విరామం లేకుండా పనిచేస్తుండాలి. అలాగని, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడం నాకిష్టం ఉండదు. సినిమా రంగంలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని… అమ్మానాన్నల ఒడిలో కూర్చుని సినిమాలు చూస్తూ ఎదిగాను. కథలు ఎంపిక చేసుకునే విషయంలోనూ…నటన విషయంలోనూ.. పరిపక్వత ఉన్న నటిని. అయితే.. నాకంతా తెలుసన్న గర్వం మాత్రం లేదు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా నడుచుకుంటాను. సినిమా విషయంలో తుది నిర్ణయం దర్శకుడిదే. వారి ఆలోచనలకనుగుణంగా మేము చేస్తే చాలు.. అంతా బాగా జరుగుతుంది” అని కీర్తి సురేశ్‌ చెప్పింది.

చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా..      

‘మహానటి’లో సావిత్రిగా జీవించిన నటి కీర్తి సురేశ్‌. ఆ చిత్రం తమిళంలోనూ ‘నడిగైయార్‌ తిలగం’ పేరుతో సక్సెస్‌ అయ్యింది. అంతకు ముందు కూడా కీర్తి స్టార్‌ హీరోలతో వరుసగా చిత్రాలు చేసింది. అంతే కాదు గత ఏడాది ఈ బ్యూటీ చేసిన ఎనిమిది చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఇప్పుడు కీర్తి సురేశ్‌ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. అందుకు కారణం.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయకపోవడమే. త్వరలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలో నటించనుంది. కాగా మాతృభాష మలయాళంలో ‘మరక్కయార్‌’ అనే చిత్రం, తెలుగులో ‘మిస్‌ ఇండియా’, హిందీలో ‘మైదాన్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంటర్‌ అవుతోంది. ఇలా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. తెలుగులో ‘రంగ్ దే’ అనే మరో చిత్రం ఆమె చేస్తోంది. ‘మైదాన్’ కోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది. ఇక తెలుగులో నటిస్తున్న ‘మిస్‌ ఇండియా’ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం. నటించనున్న తమిళ చిత్రం కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమే.