పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ‘సావిత్రి సత్యమూర్తి’ ప్రారంభం!

‘ఏ1 మహేంద్ర క్రియేషన్స్’ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాకు దర్శకుడు .’కేరింత’ ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా, హీరో భార్య పాత్రలో సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇచ్చారు.
నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ… “ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి వినోదాత్మక చిత్రమిది. హైదరాబాద్ లో 25 రోజులు, అవుట్ డోర్ లో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం” అని అన్నారు.
దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ… “దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నా స్నేహితుడు నరేంద్ర నిర్మిస్తున్నారు. కథగా చెప్పాలంటే… పాతికేళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారు అనేది ఆసక్తికరమైన అంశం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తూ హాయిగా నవ్వుకునే సినిమా. ‘కేరింత’ చూసిన తర్వాత 60 ఏళ్ల భార్యకు భర్త గా నటించే పాతికేళ్ళ కుర్రాడిగా పార్వతీశం అయితే బాగుంటుందని అతడిని ఎంపిక చేశాం.‌శ్రీ లక్ష్మీ గారు భార్య పాత్ర చేస్తున్నారు. అతడి కుమారులుగా శివారెడ్డి, సునీల్ శెట్టి… అతని తమ్ముడిగా జెన్నీగారు నటిస్తున్నారు. ” అని అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ… “నాకు ‘కేరింత’లో మంచి పేరు తెచ్చింది. అంతకు మించి పేరు తీసుకొచ్చే పాత్ర ఈ సినిమాలో లభించింది. హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కథను నమ్మి మేమంతా ఈ సినిమా చేస్తున్నాం” అని‌ అన్నారు.
శ్రీలక్ష్మి మాట్లాడుతూ… “వైవిధ్యమైన ఎన్నో మేనరిజమ్స్ తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాను. కాస్త లేట్ అయినప్పటికీ లేటెస్ట్ గా మంచి పాత్ర వచ్చింది. ఇంతవరకు నేను ఇటువంటి పాత్ర చేయలేదు. నాకు కుమారుడుగా నటించవలసిన పార్వతీశం భర్తగా చేస్తున్నారు. యూత్ మొగుడు… వింటుంటే నాకే నవ్వొస్తుంది. సినిమాకు వస్తే మిమ్మల్ని నవ్విస్తుంది ” అని అన్నారు.
నటుడు శివారెడ్డి మాట్లాడుతూ… “అద్భుతమైన వినోదంతో కూడిన మంచి పాత్రను దర్శకుడు చైతన్య నాతో చేయిస్తున్నారు. పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేసిన అనుభవంతో చైతన్య సినిమాలో బాగా తీస్తారని ఆశిస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది” అని అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్.కె. ఖద్దూస్ మాట్లాడుతూ… ” మూడు కమర్షియల్ సాంగ్స్ చేసే అవకాశం దక్కింది. పాటలు కథలో భాగంగా, కథానుగుణంగా వస్తాయి. ఇప్పటివరకు 18 సినిమాలు చేశా. ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఆషి రాయ్, గీత్ షా, ముస్కాన్ అరోరా తదితరులు పాల్గొన్నారు.