నిజాయితీ అయిన ప్రేమ అంటేనే నాకు నమ్మకం !

కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ.  ఆమె కథానాయికగా చేసిన హిందీ చిత్రం ‘ఇందూ కి జవానీ’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. డేటింగ్‌ యాప్స్‌ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా కియారా అద్వాణీ మాట్లాడుతూ .. తనకు డేటింగ్‌పై అస్సలు నమ్మకం లేదని చెప్పింది. డేటింగ్‌ యాప్స్‌ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది. ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను.  మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా’ అని చెప్పుకొచ్చింది కియారా అద్వాణీ.

కియార ‘జుగ్ జుగ్ జియో’ షూటింగ్‌లో కరోనా…  మన దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. మరికొందరు ఈ మహామ్మారి కారణంగా కన్నుమూస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎస్పీ బాలు వంటి వాళ్లు కరోనా కారణంగా కన్నుమూసారు. మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. రీసెంట్‌గా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.  ఆ సంగతి మరవక ముందే కియార అద్వానీ హిందీలో నటిస్తోన్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ ధావన్‌తో పాటు మరో అగ్ర నటుడు అనిల్ కపూర్‌తో పాటు నటి నీతూ సింగ్ కపూర్‌‌తో పాటు దర్శకుడు రాజ్ మెహతాకు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా టీమ్ మెంబర్స్‌లో కీలక సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్‌ను  వాయిదా వేసారు.

నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది!… బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా ఆడ్వాణీ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియార తన కెరీర్ ఆరంభ రోజుల గురించి మాట్లాడింది…తన తొలి సినిమా తీవ్ర నిరాశను కలిగించిందని, తనకు రెండో అవకాశం వస్తుందని కూడా ఊహించలేదని తాజాగా కియార ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది… “చాలా మంది నా తొలి సినిమా`ధోనీ` అనుకుంటారు. అది నిజం కాదు. నా తొలి సినిమా 2014లో వచ్చిన `ఫగ్లీ`. ఆ సినిమా ఫ్లాపై నా ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. నాకు రెండో అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. నా కెరీర్ అయిపోయినట్టేనని నిరాశలో కూరుకుపోయా. ఆ తర్వాత ఎన్నో ఆడిషన్లు ఇచ్చాను. చివరికి `ధోనీ` అవకాశం వచ్చింది. ఆ సినిమాతో దేశమంతా పరిచయమయ్యాన`ని కియార చెప్పింది.