ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు !

కీర్తిసురేశ్‌ ఇతర హీరోయిన్ల అవకాశాలను కొట్టేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కీర్తిసురేశ్‌ తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కీర్తీ తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో బిజీగా ఉంది. అమె  కథానాయకిగా చాలా వేగంగా ఎదిగిందన్న విషయం తెలిసిందే. విజయ్‌ 62వ చిత్రంలో మొదట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం ఇప్పుడు  కీర్తీని వరించింది. ప్రస్తుతం ‘సండైకోళి-2’ చిత్రంలో విశాల్‌కు జంటగా నటిస్తున్నారు. అదే విధంగా ‘సామి-2’లో విక్రమ్‌తో కూడా జత కడుతున్నారు. ఇందులో మరోనాయకిగా త్రిషను ఎంపిక చేశారు. అయితే ముందు అంగీకరించిన త్రిష ఆ తరువాత అనూహ్యంగా సారీ మీతో నాకు సెట్‌ కాలేదంటూ వైదొలగింది. ఈమె తప్పుకోవడానికి కారణం కూడా కీర్తీనేననే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రం కోసం కీర్తీసురేశ్‌ భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేశారనే ప్రచారం వైరల్‌ అవుతోంది.

ఈ ప్రచారం కీర్తీసురేశ్‌ దృష్టికి వెళ్లిన వెంటనే స్పందిస్తూ.. మొదట  రెండు విషయాల గురించి స్పష్టం చేయాలన్నారు. అందులో తాను అధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు తగ్గ పారితోషికాన్నే నిర్మాతలు చెల్లిస్తున్నారని చెప్పారు. ఇక రెండో అంశం ‘సండైకోళి- 2’ చిత్రం కథను దర్శకుడు చెప్పినప్పుడు తన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించానని అన్నారు. ఈ చిత్రంలో త్రిష కూడా నటిస్తున్నారని అప్పుడు దర్శకుడు చెప్పారని, ఆ తరువాత తను ఎందుకు తప్పుకున్నారో తనకు తెలియదని అన్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు? ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు.

ఇటీవల తాను నటించిన తెలుగు చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి  సంప్రదాయబద్ధంగా ఉంటుందని చీర కట్టుకుని వెళ్లాను. అయితే దాని గురించి కూడా  విమర్శలు చేశారని, మొదట వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, తరువాత బాధ కలిగిందని కీర్తిసురేశ్‌ పేర్కొన్నారు. కాగా కీర్తి పవన్‌కల్యాణ్‌తో నటించిన తెలుగు చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఈ నెల 10వ తేదీన, సూర్యతో రొమాన్స్‌ చేసిన తమిళ చిత్రం ‘తానాసేర్న్‌ద కూట్టం'(గ్యాంగ్) ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుండడం విశేషం. ఇక విజయ్‌తో నటించనున్న చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.