కన్నడ ‘రెబల్‌ స్టార్‌’ అంబరీష్‌ కన్నుమూశారు !

ప్రముఖ సినీనటుడు, కాంగ్రెస్‌ నేత అంబరీష్‌ (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 మే 29న అప్పటి మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించిన అంబరీష్‌ ,నాగరాహవు సినిమాతో 1972లో సినీరంగ ప్రవేశం చేశారు. శాండిల్‌వుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన అంబరీష్‌ కన్నడ ‘రెబల్‌ స్టార్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1991లో సినీనటి సుమలతను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అభిషేక్‌ ఉన్నారు. 200కు పైగా చిత్రాల్లో నటించి సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా శాండిల్‌వుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అంబరీష్‌… అంచెలంచెలుగా ఎదుగుతూ కన్నడ రెబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
 
దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. అనంతరం రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. కర్ణాటక ఎన్నికల్లో మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు గెలుపొందారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2013లో సిద్దరామయ్య కేబినెట్‌లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు

నా స్నేహితుడిని కోల్పోయాను !

అంబరీశ్‌ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
‘ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను.’– రజనీకాంత్.
 
‘నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈరోజు నన్ను నేను కోల్పోయాను’– మోహన్‌బాబు.
 
‘అంబరీశ్ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’- అల్లు అర్జున్‌.
 
‘ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాధికా శరత్‌కుమార్‌.
 
‘అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.’         – ఖుష్బూ.