లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఐవీ శ‌శి క‌న్నుమూశారు !

మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టిని చిత్ర రంగానికి ప‌రిచ‌యం చేసిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఐవీ శ‌శి (69) మంగ‌ళ‌వారం ఉద‌యం చెన్నైలో క‌న్నుమూశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం అస్వ‌స్థ‌త‌కు గురైన శ‌శి.. ఆస్ప‌త్రికి తీసుకెళ్తుండ‌గా దారిలోనే మ‌ర‌ణించారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో శ‌శి ఎన్నో మ‌రపురాని చిత్రాలను తెర‌కెక్కించారు. ఒక్క మాల‌యాళంలోనే ఆయ‌న 150 సినిమాలు రూపొందించారు. మ‌ల‌యాళంలోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా ఆయ‌న మ‌ర‌పురాని చిత్రాలు తెర‌కెక్కించారు. `తృష్ణ‌` సినిమాతో మ‌మ్ముట్టిని చిత్ర రంగానికి ప‌రిచ‌యం చేసింది కూడా ఈయ‌నే.
ఇక‌, ఆయ‌న రూపొందించిన `అవులుడే రావుక‌ల్‌` సినిమా సృష్టించిన సంచల‌నాలు అన్నీ ఇన్నీ కావు. మ‌ల‌యాళంలో `ఎ` స‌ర్టిఫికేట్ అందుకున్న తొలి సినిమా అదే కావ‌డం గ‌మ‌నార్హం.మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ అడ‌ల్ట్ సినిమాను హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రీమేక్ చేశారు. ఇక‌, మోహ‌న్‌లాల్ కెరీర్‌లో కొన్ని భారీ హిట్లు శ‌శి రూపొందించిన‌వే. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌తో కూడా ఆయ‌న సినిమాలు రూపొందించారు. ర‌జ‌నీని మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది కూడా శ‌శినే కావ‌డం విశేషం. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లోనే మ‌ర‌పురాని చిత్ర‌మైన `కాళి` సినిమాను రూపొందించింది కూడా శ‌శినే. కాగా, `అవులుడే రావుక‌ల్‌` సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన సీమ‌ను శ‌శి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఈయ‌న ప్ర‌తిభ‌ను గౌర‌విస్తూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు అవార్డులు అందించాయి.