బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏప్రిల్‌లో దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ మృతి చెందగా…ఇటీవల పాటల రచయిత అన్వర్ సాగర్, యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి చెందారు. ఈ రోజు బాలీవుడ్ ఫిలిం మేకర్ బసు ఛటర్జీ( 90) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని టీవీ, సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ పండిట్ తన ట్విట్టర్ ద్వారా కన్‌ఫాం చేశారు… “లెజండరీ ఫిలిం మేకర్ బసుచటర్జీ కన్నుమూసారనే వార్తని చెప్పడానికి చింతిస్తున్నాను. అతని అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నాం సాంట్‌క్రూజ్ స్మశాన వాటికలో జరుగుతాయి. అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను” అని అశోక్ తన ట్వీట్‌లో తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న బసు చటర్జీ మృత్యువాత చెందడంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బసు చటర్జీ 1969లో వచ్చిన ‘సారా ఆకాశ్’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కొంత కాలానికి ఆయన ‘బాల్కనీ క్లాస్ డైరెక్టర్’గా ప్రత్యేక ట్యాగ్ పొందారు. ‘చోటీసీ బాత్’, ‘రజనీగంధ’, ‘బాతో బాతో మే’, ‘ఎక్ రుకాహువా ఫైసలా’, ‘చమేలీకి షాది’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన హిందీతో పాటు బెంగాలీలో కూడా సినిమాలు తీశారు. బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.. అమితాబ్ బచ్చన్‌తో ‘మంజిల్’, రాజేశ్ ఖన్నాతో ‘చక్రవ్యూహ్’, దేవానంద్‌తో ‘మన్ పసంద్’ సినిమాలు తీశారు. ఇవి సూపర్‌హిట్ అయ్యాయి. గతంలో ఆయన టీవీ సీరియళ్లు కూడా రాశారు. 1992లో ఆయనకు జాతీయ అవార్డు లభించింది. ‘బైస్కిల్ థీఫ్’, ‘బిల్లీ వైల్డర్’ అనే సోషియో రొమాంటిక్ కామెడీ చిత్రాలు అతనికి ఎంతో ప్రేరణగా నిలిచాయి..