మ‌ధురగానం మూగ‌బోయింది.. గాన‌గంధ‌ర్వుడు అస్త‌మించారు!

కోట్ల మందిని దశాబ్దాల పాటు తన గానంతో అలరించిన దేశం గర్వించదిగిన గాయకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో కన్ను మూశారు. సంగీత ప్రియులను అనాథలను చేసి వెళ్లిపోయారు. ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. ఈయ‌న‌ సాంబ‌మూర్తి, శ‌కుంత‌ల‌మ్మ దంప‌తుల రెండో సంతానం. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోకపోయినా రాగా తాళ జ్ఞానం పుష్కలంగా ఉండడంతో అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఒక అర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకుని మిత్రులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇంజ‌నీర్ కావాల‌ని క‌ల‌లు క‌ని గాయ‌కుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు చ‌ర‌ణ్‌ కుమారుడు.పల్లవి కుమార్తె. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని.ఈమె నటుడు శుభలేఖ సుధాకర్‌ను శైల‌జ‌ వివాహమాడిన విష‌యం తెలిసిందే.

బాలు పాటను సంగీత దర్శకుడు కోదండపాణి విని ..బాలు పాడిన విధానాన్ని మెచ్చుకుని, సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చారు. 1966లో పద్మనాభం నిర్మించిన `శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న` చిత్రంతో నేపథ్య గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దుజే కేలియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన‌సినీ ప్ర‌స్థానంలో దాదాపు 14 భాష‌ల‌లో త‌న గాత్రంతో అల‌రించారు. న‌ల‌భై వేల పైచిలుకు పాట‌లు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.

ప్రముఖ హీరోల‌కు గాత్ర‌దానం !…క‌మ‌ల్ హాస‌న్‌కు చేతిలో సినిమాలు లేని స‌మ‌యంలో ఆయ‌న‌ మీదున్న ప్రేమ‌తో బాలు నిర్మాత‌గా మారారు. అలా తీసిని ‘శుభ సంక‌ల్పం’ ఎన్నో అవార్డుల‌ను తెచ్చి పెట్టింది. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్ ఖాన్‌, జెమిని గ‌ణేష‌న్ వంటి ప‌లువురు హీరోల‌కు గాత్ర‌దానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, న‌ట‌న‌తోనూ బాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా వెండితెరపై కనిపించిన ఎస్పీబీ అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. తమిళ ‘కేలడి కన్మణి’లో క‌థానాయ‌కుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ‘ఓ పాప లాలీ’ పేరుతో అనువాదం అయింది. త‌ర్వాత ప‌విత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్‌, మిథునం వంటి ప‌లు సినిమాల్లోనూ న‌టించారు.

శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం!…వెండితెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా బాలు తనదైన ముద్ర వేశారు. `పాడుతా తీయగా` వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మంది గాయనీగాయకులను ప్రోత్సహించారు. భారతదేశ ప్రభుత్వం నుంచి ఎస్పీబీ 2001లో `పద్మశ్రీ` పురస్కారాన్ని, 2011లో `పద్మభూషణ్` పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలను దక్కించుకున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఎస్పీబీ `శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం` (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) అందుకున్నారు.