లాస్ ఏంజెల్స్ తెలుగు వారితో ఘనంగా ‘లాటా’ మినీ ఒలింపిక్స్

మునుపెన్నడూ ఏ NRI తెలుగు సంస్ధ నిర్వహించని విధంగా లాటా “మినీ ఒలింపిక్స్” పేరున పెద్ద ఎత్తున దాదాపు 1100 మంది క్రీడాకారులతో, లాస్ ఏంజలెస్ మహా నగరములో ఎనిమిది క్రీడా పోటీలకు ఆరు చోట్ల లీగ్ మ్యాచులు, మళ్ళీ ప్రతీ ఆటకూ ఫైనల్స్ తో కలపి 6 వారాల పాటు జరిగిన పోటీలలో అత్యద్భుతంగా, పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, ఆడవాళ్ళూ, మగవాళ్ళు, అందరూ పాల్గొనటం జరిగింది. మే 26 న మొదలైన క్రీడాపోటీలు జులై 1 న క్రికెట్ ఫైనల్స్ తో ముగిసాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికోయిట్, చెస్, క్యారంస్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడలు ….ఇర్వైన్, ఈస్ట్ వెల్, వాలెన్సియా, టోరెంస్, సైప్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడై, నగరాల్లో 145 మంది కార్యకర్తలతో నిర్వహించటం జరిగింది.
ఒకొక్క క్రీడ ఆడ, మగా, చిన్న పిల్లలకి వివిధ వయసు విభాగాల్లోని నిర్వహించటం జరిగింది. వాలీబాల్, చెస్, క్యారంస్, ప్రతీ సంవత్సరం చేస్తున్నా…. మొట్ట మొదటి సారి నిర్వహించిన టెన్నిస్, టెన్నికోయిట్, స్విమ్మింగ్, క్రికెట్, రన్నింగ్ విశేషం గా ఆకట్టుకున్నాయి. క్రికెట్ లో అత్యధికం గా 275 మంది, వాలీబాల్లో 200 మంది, టెన్నిస్, క్యారంస్, టెన్నికోయిట్ లలో చెరొక 150 మంది పాల్గొన్నారు. వాలెన్సియా నుంచి, శాండియెగో వరకు, కల్వర్ సిటీ నుంచి అటు రివర్ సైడ్ వరకు ఎంతో ఔత్సాహంగా పాల్గొన్నారు. విశేషమేమిటంటే…ఆడవారు, పిల్లలు అత్యధికంగా పాల్గొన్నారు.
సరిగ్గా 10 సంవత్సరాల్లో (2028) ఇక్కడ లాస్ ఏంజెల్స్ మహానగరం లో ఒలింపిక్స్ జరుగుతుండటం, ‘ఈ రోజు బాలలే రేపటి విజేతలు’ అనే సంకల్పంతో ‘లాటా మినీ ఒలింపిక్స్’ కు ఇంకా విశిష్టత చేకూరింది. లాటా మినీ ఒలింపిక్స్ ని ప్రతీ ఏటా ఇలానే జరపాలని పిల్లలు, తల్లితండ్రులు లాటా ని కోరారు. మినీ ఒలింపిక్స్ ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకూ, ప్రతీ క్రీడాకారుణికి, దాతలకూ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ,బోర్డు అఫ్ డైరెక్టర్స్ తరపున పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మినీ ఒలింపిక్స్ ఇంత అద్భుతంగా జరగటానికి ప్రధాన కారణం అయిన కార్యకర్తలకే ఈ విజయం అంకితం. అతి తొందరలోనే అందరిని అలరించే విధంగా మినీ ఒలింపిక్స్ విజయోత్సవాలు ప్రకటిస్తాము.