కీర్తి సురేష్ కు, వాళ్ళ బామ్మకు లక్కీ ఛాన్స్ !

కీర్తి సురేష్.. ‘మహానటి’తో ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది. ఇప్పుడీ పేరు సావిత్రిగా మారిపోయింది. అందరినోట అచ్చు సావిత్రే దిగివచ్చింది.. అని అనిపించుకున్న కీర్తి సురేష్.. ‘మహానటి’తో ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఎటువంటి చిత్రం చేస్తుందనే దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్నాయి. భారీ సంస్థల నుంచి కీర్తి సురేష్‌కు అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జయలలిత బయోపిక్, ఎన్టీఆర్ బయోపిక్, బాలయ్య చేయాలనుకుని ఆగిపోయిన ‘నర్తనశాల’ వంటి చిత్రాలలో కీర్తి సురేష్‌ నటించే అవకాశాలు ఉన్నాయని, చర్చలు జరుగుతున్నాయని ఇటీవల వార్తలు వినిపించాయి.
తాజాగా ఇలాంటిదే మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మహానటి సినిమా చూసిన రాజమౌళి, సినిమాపై, కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి త్వరలో తెరకెక్కించబోయే భారీ మల్టీస్టారర్ మూవీలో ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తాజాగా వార్తలు సంచరిస్తున్నాయి. మరి నిజంగా ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం ఈ సినిమాకి మరింత ఆకర్షణ కావడం మాత్రం ఖాయం.
ఎనిమిది పదుల ప్రాయంలో, సినిమాల్లో ….
‘మహానటి’గా కీర్తిసురేష్‌ ఎంతో అభినయంతో నటించి మెప్పించింది. ప్రతిష్టాత్మకచిత్రాల్లో కీర్తి సురేష్ కు  ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఆఫర్ల విషయంలో కీర్తి సురేష్‌కు దీటుగా ఆమె  బామ్మ సరోజ కూడా ఉండడం విశేషం.
కీర్తి తల్లి మేనక మలయాళంలో ఒకప్పుడు పాపులర్‌ హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే. కీర్తి తల్లి మేనకకు తల్లి అయిన సరోజకు సినిమాలతో ఎటువంటి సంబంధం లేదు. అప్పుడప్పుడూ కీర్తికి తోడుగా షూటింగ్‌లకు వెళ్తుండేవారంతే. ‘రెమో’ షూటింగ్‌ సమయంలో సరోజను చూసిన శివకార్తికేయన్‌.. ఆమెను ఒక్క సీనులో నటింపజేశారు. ఆ తరువాత ఆమెకు కూడా సినిమాల్లో నటించాలన్న ఆశ కలిగింది. ఈ నేపథ్యంలో చారుహాసన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘దాదా 87’లో సరోజను కీలకపాత్రకు ఎంపిక చేశారు. 87 ఏళ్ల వయసున్న దాదా పాత్ర పోషిస్తున్న చారుహాసన్‌కు భార్యగా నటింపజేసేందుకు 80 ఏళ్ల వయసున్న బామ్మలను అన్వేషిస్తుండగా, కీర్తిసురేష్‌ బామ్మ గురించి తెలిసింది. ఆమెకు కూడా నటనపై ఆసక్తి ఉండడంతో ఆ పాత్రలో నటింపజేశారు. ఇది కాకుండా, పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కడైకుట్టి సింగం’ చిత్రంలో హీరో కార్తికి బామ్మగా సరోజ నటిస్తున్నారు. అలాగే మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయట. ఎనిమిది పదుల ప్రాయంలో సినిమాల్లో అడుగుపెట్టిన సరోజ.. వరుస ఆఫర్లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.