‘మా’ వివాదాన్ని పరిష్కరించిన కలెక్టివ్ కమిటీ

‘మా’ అసొషియేషన్‌లో వివాదాలు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు.
ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్‌మీట్‌ పెట్టి తప్పు చేశారు. ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుంద’న్నారు.ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్‌ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్‌ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు.
 
కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ… ‘సంస్ధ లో డిఫరెంట్ ఓపినియన్స్ రావటం సహజం.‌ కలెక్టివ్ కమిటీ ద్వారా అందరం కలుసుకొని మాట్లాడుకున్నాం. గతం గతః. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కలిసి సక్సెస్ చేస్తాం. నేను, శివాజీ రాజా గారు సినీ పెద్దల సపోర్ట్ తో సిల్వర్ జూబ్లీ ఈవెంట్ లను సక్సెస్ చేయటానికి కృషి చేస్తాం’ అన్నారు.
అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ… చిన్న చిన్న మనస్పర్దలు వచ్చిన మాట వాస్తవమే.. కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము. ఎలాంటి అవకతవకలు లేవని తేలిందన్నారు.
ఈ సమావేశం లో డా. కె.ఎల్. నారాయణ, డి. సురేష్ బాబు, జెమినీ కిరణ్ పాల్గొన్నారు.