శ్రీరెడ్డి ప్ర‌వ‌ర్త‌నతో స‌భ్య స‌మాజం సిగ్గుప‌డుతోంది !

వ‌ర్ద‌మాన న‌టి శ్రీరెడ్డి తెలుగు న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలంటూ, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) లో స‌భ్య‌త్వం క‌ల్పించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లతో  శనివారం ఉద‌యం హైద‌రాబాద్ లోని ఫిలిం ఛాంబ‌ర్ ఎదుట అర్ధ న‌గ్నంగా మీడియా స‌మ‌క్షంలో నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర‌స‌న‌కు, వ్యాఖ్య‌ల‌కు స్పందిస్తూ `మా` ఆదివారం ఉద‌యం హుఠాహుటిన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా..
`మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, `ఏదైనా స‌మ‌స్య వ‌స్తే నేరుగా `మా`  ఆ ఫీస్ కు వ‌చ్చి ఫిర్యాదు చేయండి. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం. అంతేగాని ఇలా బ‌హిరంగంగా బ‌ట్ట‌లిప్పి ప్ర‌ద‌ర్శ‌న చేయోద్దు. ఇలాంటి వాళ్ల‌ను మా స‌హ‌క‌రించ‌దు. తేజ గారితో మాట్లాడి ఆమెకు రెండు సినిమాల్లో అవ‌కాశం కూడా ఇప్పించాం. అలాగే ప్ర‌తాని రామ‌కృష్ణ గారు సినిమాలో కూడా అవ‌కాశం క‌ల్పించారు. మాకు కొన్ని నియ‌మ నిబంధన‌లు ఉంటాయి. వాటిని క్రాస్ చేసి మేమ ఏమీ చేయ‌లేం. ఇలాంటి వాళ్ల‌కు స‌భ్య‌త్వం ఇచ్చి ప్రోత్స‌హిస్తే చాలా మంది వ‌స్తారు. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దు. ఇలా చేస్తే కార్డు ఇవ్వం. నాకు స్ర్తీలు అంటే చాలా గౌర‌వం ఉంది. అసోసియేష‌న్ విలువ‌లు ఏంటో `మా` క‌మిటీలో ఉన్న‌వారంద‌రికీ  అంద‌రికీ తెలుసు.  ఉచిత ప్ర‌చారం కోసం టీవీల‌కు ఎక్కొద్దు. ఇలాంటివి  చూస్తుంటే స‌భ్య సమాజంలో ఉన్నామా? అనిపిస్తుంది. ఆమెకు మాన‌సిక స్థితి స‌రిగ్గా లేదు. ఆమె మాట్లాడిన మాట‌ల‌న్నీ అవాస్త‌వాలే. మా ద‌గ్గ‌ర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆమె ప్ర‌వ‌ర్త‌న వ‌ల‌న స‌భ్య‌త్వం ఇవ్వ‌కూడద‌ని `మా` క‌మిటి నిర్ణయం తీసుకుంది. ఆమెతో క‌లిసి `మా`  లో ఉన్న వారంతా క‌లిసి న‌టించ‌డానికి వీలు లేదు. ఒక‌వేళ అలా చేస్తే వాళ్ల స‌భ్య‌త్వం కూడా తొల‌గిస్తాం` అని అన్నారు.
`మా` వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ మాట్లాడుతూ, `మొద‌టి నుంచి `మా` పై  శ్రీరెడ్డి  వైఖ‌రి స‌రిగ్గాలేదు. `మా`లో స‌భ్య‌త్వం కోసం ఆమెకు ద‌ర‌ఖాస్తు ఫారం కూడాం  ఇచ్చాం. అంటే మాలో మెంబ‌ర్ గా ఆమెను స్వాగ‌తించిన‌ట్లే.  నువ్వు మెంబ‌ర్ గా చేరు అని చెప్పాం. అప్లికేష‌న్ లో కొన్ని  కూడా పె ట్టింది. ప్ర‌పోజ‌ల్స్ సంత‌కాలు,  ఫోటోలు కూడా అవ‌స‌రమ‌ని చెప్పాం. కేవ‌లం ధ‌ర‌ఖాస్తు రుసుము 1000 రూలు ఇచ్చింది. స‌భ్య‌త్వం కోసం కొంత మొత్తం కూడా క‌ట్టాల‌ని  చెప్పాం. అలాగే ఇక‌పై టీవీల‌కు ఎక్కి  ఎలాంటి ర‌చ్చ చేయ‌ద్ద‌ని ఆరోజే చెప్పాం. అన్నింటికీ అవున‌ని..చివ‌ర్లో సారీ కూడా చెప్పింది. ఛాంబ‌ర్  మొట్లు దిగుతూ వెళ్లిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ చెత్త క‌థ‌నాలు? ఆమెకు కార్డు ఇస్తామ‌న్నా కుడా ఆమె నిన్న అసభ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించింది. చాలా దారుణ‌మైన సంఘ‌ట‌న‌ల‌కు ఒడిగ‌డుతోంది.  అందుకే మేమంతా మీటింగ్ ఏర్పాటు చేసుకుని `మా` లో ఆమెకు స‌భ్య‌త్వం ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాం` అని అన్నారు.
`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ,` ఫిలిం ఛాంబ‌ర్ ప్రాంగ‌ణంలో ఎన్నో మంచి, చెడు కార్య‌క్ర‌మాలు కూడా చూశాం. కానీ ఇలాంటి అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చూస్తాన‌ని జీవితంలో అనుకోలేదు. మొత్తం శుభ్రం చేయాల్సిన ప‌రిస్థితి ఆ  అమ్మాయి తీసుకొచ్చింది. అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం అనేది ఓ క్రైమ్ లాంటింది. ఆవేద‌న‌లో అలా చేసిందా?  లేక‌?  మాన‌సిక స్థితి స‌రిగ్గా లేక అలా ప్ర‌వ‌ర్తించిందా? అన్న‌ది ఆమెకే తెలియాలి.  ఇలాంటి స‌మ‌స్య‌లు తెలెత్తిన‌ప్పుడు అంతా క‌లిసి పోరాటం చేయాలి. ఇలాంటి వాటిని ఎవ‌రూ ప్రోత్సహించ వ‌ద్దు. తెలుగు సినిమా ఎంతో ఉన్న‌త స్థాయికి చేరుకుంటుంది. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటోంది. అలాంటి స‌మ‌యంలో  ఇలాంటి వ్య‌క్తి పాన‌కంలో పుడ‌క‌లా వ‌చ్చింది. ఇక‌పై ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే  చ‌ట్ట‌బ‌ద్దంగా వ్వ‌వ‌రిస్తాం` అని హెచ్చ‌రించారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ` సినిమా ఇండ‌స్ర్టీ పుట్టిన త‌ర్వాత ఇలాంటి సంఘ‌టన ఎక్క‌డ చూడ‌లేదు. జ‌ర‌గ‌లేదు. ప‌రిశ్ర‌మ‌కు ఓ  గౌర‌వం ఉంది. `మా` ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎవ‌రికి స‌మ‌స్య వ‌చ్చినా `మా` లో ఫిర్యాదు చేస్తే ప‌రిష్క‌రిస్తున్నాం. కానీ ఇలా స‌మస్య వ‌చ్చింద‌ని మీడియాకి  ఎక్కి ర‌చ్చ చేయ‌డం సబ‌బు కాదు. నిన్న శ్రీరెడ్డిని చూసి అంతా షాక‌య్యారు. భ‌విష్య‌త్ లో సినిమా రంగంలోకి రావాల‌నుకున్న వారు చూస్తే ఏమ‌నుకుంటారు?  సినిమా అంటే ఇలాగే ఉంటుందా?  అని అనుకుంటారు. మా తీసుక‌న్న ఈ నిర్ణ‌యానికి హ‌ర్షిస్తున్నా`  అని అన్నారు.
జాయింట్ సెక్ర‌ట‌రీ హేమ మాట్లాడుతూ, `ఆడ‌వాళ్ల‌కు స‌మస్య‌లు వ‌స్తే  హేమ ముందుకు వ‌స్తుంది. ఈ విష‌యంపై  ఇన్ని రోజుల  నుంచి  వివాదం న‌లుగుతోన్న బ‌య‌ట‌కు రాలేదంటే  కార‌ణం ఆమె వెళ్లిన విధానం క‌రెక్ట్ గా లేక‌పోవ‌డం వ‌ల్లే. మౌన పోరంటం చేసి నిర‌స‌న తెల‌ప‌వ‌చ్చు. లేదా? మ‌రో విధంగా  చేయోచ్చు.  అంతే కానీ ఇలాంటి ప‌నులు చేయ‌డం చాలా సిగ్గు చేటు. ఆ మ‌ధ్య  ఓ  పెద్ద  డైరెక్ట‌ర్ పై ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఆ డైరెక్ట‌ర్ `మా` ఆఫీస్ కు వ‌చ్చారు.  కానీ ఫిర్యాదు చేసిన  అమ్మాయి  మాత్రం రాలేదు. శ్రీరెడ్డికి `మా` స‌భ్య‌త్వ‌ ఫార‌మ్ ఇచ్చాం. స‌వ్యంగా నింప‌లేదు. ఉచితంగా మెంబ‌ర్ షిప్ ఇవ్వ‌రు. వ‌య‌సు మ‌ళ్లిన వాళ్ల‌కు మాత్ర‌మే  ఉచిత మెంబ‌ర్ షిప్ ఇస్తాం. సినిమాల్లో  అదృష్టం క‌లిసి రావాలి. ఒక  సినిమా హిట్ అయితే ప‌ది అవ‌కాశాలు వ‌స్తాయి. తెలుగు వాళ్ల‌కు వేషాలు ఇవ్వ‌లేద‌న్న మాట అవాస్త‌వం` అని అన్నారు.
ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ,`  శ్రీరెడ్డి స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా చేసింది. ఆమె అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా.  తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ త‌రుపున ఆమెకు మెంబ‌ర్ షిప్  కార్డు కూడా ఇప్పించాం. ఆ త‌ర్వాత నా సినిమాలో అవ‌కాశం కూడా కల్పించాం. 50 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఇంకా మూడు ,నాలుగు అవ‌కాశాలు చేతిలో ఉన్నాయి. అయినా ఆమె ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు.  ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై ఒక‌సారి పున ప‌రిశీల‌న చేసి కార్డు వెన‌క్కి తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఇలా నీచంగా దిగ‌జారితే ఎవ‌రూ కూడా స‌హ‌క‌రించారు` అని అన్నారు.
ఈ స‌మావేశంలో  వైస్ ప్రెసిడెంట్ వేణు మాధ‌వ్, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, నాగినీడు, ఉత్తేజ్, గౌతం రాజు, సి. వెంక‌టగోవింద‌రావు, జ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.