నిర్మాతగా ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నా!

మూడు దశాబ్దాలు సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుత చిత్రాలు, మరెన్నో అత్యద్భుత పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌. పెళ్ళి అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న మాధురీ కొంత కాలం తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రలున్న చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘బక్కెట్‌ లిస్ట్‌’ అనే మరాఠీ చిత్రంలో నటిస్తోంది. ఇన్నేండ్ల కెరీర్‌లో మాధురీ నటిస్తున్న తొలి మరాఠీ చిత్రమిది. నటిగా ప్రేక్షకులను విశేషంగా అలరించిన మాధురీ ఇకపై అభిరుచిగల నిర్మాతగానూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది….బాలీవుడ్‌ బ్యూటీలు ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ కేవలం నటనపైనే దృష్టి పెట్టడం లేదు. నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ కూడా చేరారు. ఆర్‌.ఎన్‌.ఎం. మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ని ఆరంభించారు. స్వప్ననీల్‌ జయకర్‌ దర్శకత్వంలో త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని ఆమె నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. తొలి ప్రయత్నంగా మరాఠీలో ‘ఆగస్ట్‌ 15’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌ పీతే, మృణ్‌మయి దేశ్‌పాండే నాయకానాయికలుగా నటిస్తున్నారు.

“ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని, నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నానని మాధురీ తెలిపారు. సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. యోగేశ్‌ వినాయక్‌ జోషి ఈ సినిమాకి మంచి కథ అందించారు. మంచి టీమ్‌తో ఈ సినిమా నిర్మించబోతున్నాం. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా మంచి నటి అనిపించుకున్నా. ఈ సినిమాతో మంచి నిర్మాత అని కూడా అనిపించు కుంటా’’ అని మాధురి అన్నారు.