మేకప్‌ లేకుండా చెయ్యడానికైనా నేను రెడీ !

‘మహానటి’ కీర్తి సురేష్‌… మహానటి వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన ఆమెకు ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.తమ గ్లామర్‌తో దుమ్ము రేగ్గొడుతున్న హీరోయిన్ల మధ్య కీర్తి సురేష్‌ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది అంటే… అది ఆమె టాలెంటే తప్ప మరొకటి కాదు. ‘మంచి నటి’ అని అందరి ప్రశంసలు అందుకుంటున్న కీర్తి సురేష్… తను గతంలో బాలనటిగా చేసిన హీరోల సినిమాల్లోనే హీరోయిన్‌గా నటిస్తోంది…
‘‘నేను కొందరి హీరోలతో బాల నటిగా చేశాను. ఇప్పుడు వారి పక్కన హీరోయిన్‌గా చేస్తున్నాను. వారి పక్కన బాలనటిగా చేసిన విషయం వారితో చెప్పను. అలాగే ‘మీ సినిమాలు చూస్తూ పెరిగాను’…వంటి కబుర్లు కూడా చెప్పను. వయస్సు గురించి మాట్లాడితే వారు హర్టయ్యే అవకాశముంది. నేను చిన్నప్పటి నుంచీ స్క్రీన్‌మీద చూసి ఆస్వాదించిన వాళ్ళను చూస్తే నాకు చాలా గౌరవం. వారి పక్కన చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. నా జీవితంలో ఏం జరిగినా అదంతా భగవంతుని దయగానే చూస్తాను.
నా కెరీర్‌ ప్రారంభం నుంచీ నాకు నటనకు అవకాశమున్న పాత్రలే వస్తున్నాయి. నా అదృష్టం కొద్దీ గ్లామర్‌డాల్‌గా నన్ను ఎవరూ చూడలేదు. దీనికి కారణం నా కుటుంబ నేపథ్యమే అని నా నమ్మకం. గ్లామర్‌ పాత్రలు చేస్తే డబ్బు వస్తోందేమో కానీ, పేరు రాదు. భగవంతుడి దయ వలన కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసే అవసరం నాకు ఇంకా రాలేదు. అందుకే గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండగలిగా. మేకప్‌ లేకుండా సహజంగా కనిపించడానికి అయినా నేను రెడీ. ఇంత వరకూ అలాంటి సబ్జెక్ట్‌తో ఎవరూ రాలేదు..’’ అని కీర్తిసురేష్ తెలిపింది.ఇటీవల విజయ్‌కి జోడీగా కీర్తి నటించిన ‘సర్కార్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.