బాలీవుడ్ లో ఐటం సాంగ్ చేస్తున్న ‘భరత్’ భామ

‘భరత్‌ అనే నేను’ సినిమాలో మహేష్‌బాబు సరసన వసుమతిగా నటించి, అందం నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన కైరా అద్వానీ తాజాగా బాలీవుడ్‌లో ఓ బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. కరణ్‌ జోహర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ‘కళంక్‌’ సినిమాలోని ఓ ప్రత్యేక సాంగ్‌లో మెరవబోతోంది. ఈ స్పెషల్‌ సాంగ్‌లో వరుణ్‌ ధావన్‌ సరసన కైరా నటించనుంది.

కరణ్‌ జోహర్‌ తన తండ్రి యష్‌జోహార్‌ కలలు కన్న ప్రాజెక్ట్‌ ‘కళంక్‌’. ఈ చిత్రాన్ని 1940 నేపథ్యంలో ఎపిక్‌ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ‘టు స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, అలియా భట్‌, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్‌, మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కరణ్‌ జోహర్‌ చిత్రంలో నటించడం పట్ల కైరా స్పందిస్తూ… ‘కరణ్‌ జోహర్‌తో కలిసి పనిచేయడమనేది నా కల. అది నెరవేర బోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చిత్రంలో నటించడం నాకు ప్రశంసనీయమైనదిగా భావిస్తున్నాను’ అని తెలిపింది. కైరా ప్రస్తుతం రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందే సినిమాలోనూ నటిస్తోంది.