వెయ్యిమంది చిన్నారులకు మహేష్ గుండె చికిత్స

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు గత మూడున్నరేళ్లలో మొత్తం 1000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. మహేశ్‌తో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రి వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 1000 మంది చిన్నారులకు విజయవంతంగా గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేసింది. ఈ సందర్భంగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించడం కోసం ఆంధ్రా హాస్పిటల్స్‌, యూకేకు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఓ మంచి కార్యం కోసం తమకు సహాయం చేసిన వైద్యుడు పీవీ రామారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన అద్భుతమైన వైద్య బృందానికి కుడోస్‌ అని పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో తీసిన ఫొటోలను షేర్‌ చేశారు.
ఈ సందర్భంగా పీవీ రామారావు ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. శస్త్ర చికిత్సలు చేయడానికి మహేశ్‌ విరాళాలు ఇచ్చారని, సర్జరీ తర్వాత చిన్నారుల వైద్య సేవకు కావాల్సిన సహాయం కూడా చేశారని చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.