వీరిద్దరికీ ఆ విషయంలో బెడిసిందట !

దిల్ రాజుకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాదిలో వచ్చిన ‘లవర్’, ‘శ్రీనివాస కళ్యాణం’ వరుస డిజాస్టర్లు కాగా, దసరా కానుకగా వచ్చిన ‘హాలో గురు ప్రేమకోసమే’ ఒక మాదిరి అనిపించింది. దిల్ రాజు అభిరుచి గల నిర్మాత. కుటుంబ కథలతో పాటు, యువతను ఆకట్టుకునే కధలను ఎంచుకోవడంలో దిట్ట.కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో… హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా డైరెక్టర్ టాలెంట్ పై నమ్మకంతో సినిమాలు చెయ్యడంలో ముందుంటాడు.
 
అయితే దిల్ రాజు  తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద  పరాజయం పాలవ్వడం తో.. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో చేస్తున్న ‘మహర్షి’ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనీ రాజు కృతనిశ్చయంతో ఉన్నారట. దీంతో సినిమా కథ విషయంలో చాలా జోక్యం చేసుకుంటున్నాడని బయట చెప్పుకుంటున్నారు.
 
అసలు విషయం ఏమిటంటే… ‘మహర్షి’ కథ ప్రకారం ఇందులో రెండు ఫైట్లకే అవకాశం ఉందట. సినిమాలో ఎక్కువభాగం సెంటిమెంట్ – కామెడీ–రొమాన్స్ తో సాగుతుందట. అయితే, దిల్ రాజు మాత్రం ఈ మూవీలో మరో రెండు పోరాట సన్నివేశాలను పెట్టాల్సిందేనని పట్టుబడుతున్నాడట. దీనికి కారణం..  బాలీవుడ్ డబ్బింగ్ లో ఈ చిత్రానికి భారీ మొత్తం రావాలంటే.. యాక్షన్ డోస్ చాలా అవసరమనేది దిల్ రాజు ఆలోచన. ఇలా చేస్తే హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీ రేటువస్తుందని రాజు ఆశిస్తున్నాడట.
 
వంశీ పైడిపల్లికి ఆ దిశగా ఆలోచించాలని.. కథలో కొద్దిపాటి మార్పులు చేసి ఫైట్స్ పెట్టినా పర్వాలేదని దిల్ రాజు చెబుతున్నట్లు బయట వినిపిస్తోంది. అయితే, మహేష్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. స్క్రిప్ట్ ప్రకారం రెండు ఫైట్లు సరిపోతాయని, అనవసరంగా కొత్త ఫైట్లు జోడించడం వల్ల మూవీ అసలు కథ జనాలకు కనెక్ట్ కాకపోవచ్చని, ఇబ్బంది రావచ్చని మహేష్ అంటున్నాడట. ప్రస్తుతం ఈ విషయమై మహేష్ – దిల్ రాజు మధ్య ఈ ఫైటింగ్  విషయంపై  చర్చ జరుగుతోందట.