ఎన్నో సినిమాలను కలిపి చూపిన… ‘మహర్షి’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, వైజ‌యంతీ మూవీస్‌, పివిపి సినిమాలు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధలోకి వెళ్తే…

తెలుగువాడైన రిషి కుమార్‌(మ‌హేశ్‌)ని అమెరికాలోని ఆరిజ‌న్ కంపెనీకి సి.ఇ.ఒగా నియ‌మించుకుంటుంది.  దాంతో అంద‌రూ తెలుగువాడు అమెరిక‌న్ కంపెనీ సి.ఇ.ఒ అయినందుకు సంతోషిస్తుంటారు. రిషి పి.ఎ(మీనాక్షి దీక్షిత్‌), ఓ స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌ని త‌ను చ‌దివిన వైజాగ్ ఐ.ఐ.ఇ.టి కాలేజ్‌లో ఎంటెక్ పూర్వ విద్యార్థుల‌ను, లెక్చ‌ర‌ర్‌ని ఆహ్వానిస్తుంది. అంద‌రినీ చూసి ఆనంద‌ప‌డ‌తాడు. అప్పుడు అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంది. హైద‌రాబాద్‌లోని రిషి వైజాగ్ ఐఐఇటి కాలేజ్‌లో ఎంటెక్ జాయిన్ అవుతాడు. అక్క‌డ త‌న‌కు ర‌వి(అల్ల‌రి న‌రేశ్‌), పూజ(పూజా హెగ్డే) ప‌రిచ‌యం అవుతారు. ముగ్గురు మంచి మిత్రుల‌వుతారు. ఓట‌మి అంటే భ‌య‌ప‌డే రిషి కుమార్ ప్ర‌తి సెమిస్ట‌ర్‌లోనూ కాలేజ్ టాప‌ర్‌గా నిలుస్తుంటాడు. రిషిలో మంచిత‌నం, ఇంటెలిజెన్స్ చూసి పూజా అత‌న్ని ప్రేమిస్తుంది. ఎప్పుడూ భ‌య‌ప‌డే ర‌విలో రిషి కాన్ఫిడెన్స్‌ను నింపుతాడు. అదే స‌మ‌యంలో రిషి చేసిన సాఫ్ట్‌వేర్‌ని ఓ పెద్ద కంపెనీ వాళ్లు ఇష్ట‌ప‌డి, అత‌నితో డీల్ మాట్లాడాల‌నుకుంటారు. అప్ప‌టికే రిషిపై కోపం పెంచుకున్న ఎం.పి కొడుకు అజ‌య్‌(కమ‌ల్ కామ‌రాజు) అసూయ ప‌డి రిషిని ఓ కేసులో ఇరికిస్తాడు. రిషిని కాలేజ్‌నుండి పంపేయాల‌ని మేనేజ్ మెంట్ అనుకుంటున్న స‌మయంలో ఓ వ్య‌క్తి కార‌ణంగా రిషి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. పూజ‌తో ప్రేమ‌ను కూడా కాద‌నుకుని యు.ఎస్ వెళ్లిపోతాడు. ఎదిగే క్ర‌మంలోఎవ‌రినీ ప‌ట్టించుకోని రిషికి లెక్చ‌ర‌ర్ కార‌ణంగా ఓ నిజం తెలుస్తుంది. దాంతో రామ‌వ‌రంలోని త‌న స్నేహితుడు ర‌విని వెతుక్కుంటూ వ‌స్తాడు. కానీ నేష‌న‌ల్ ప్రాజెక్ట్ కార‌ణంగా రామ‌వ‌రం గ్రామాన్ని వివేక్ మిట్ట‌ల్‌కు చెందిన కంపెనీ ఆక్ర‌మించుకోవాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ర‌వి త‌న గ్రామం కోసం పోరాడుతూ ఉంటాడు. స్నేహితుడు ర‌విని త‌న‌తో వ‌చ్చేయ‌మ‌ని రిషి అడిగినా .. త‌న గ్రామ స‌మ‌స్య తీరే వ‌ర‌కు తాను రానంటాడు. దాంతో గ్రామ స‌మ‌స్య ప‌రిష్కారానికి ముంబైలోని వివేక్ మిట్ట‌ల్‌తో మాట్లాడినా ఫ‌లితం ఉండ‌దు.అప్పుడు రిషి కుమార్ ఏం చేస్తాడు? స‌్నేహితుడి కోసం ఎలాంటి అడుగు వేస్తాడు? చివ‌ర‌కు రామవ‌రం స‌హా ఇత‌ర గ్రామాల‌ను కార్పొరేట్స్ బారి నుండి ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే….

విశ్లేషణ…
రైతుల ఆత్మహత్యలు, వాటి వెనక ఉన్న కారణాలు చెప్పే  పాయింట్ తో ధైర్యంగా కమర్షియల్ గా భారీ చిత్రాన్ని చేసిన దర్శక,నిర్మాతలను అభినందించాలి. కానీ ఆ సామాజికత కథనంలో ప్రభావవంతం గా  కనిపించలేదు. దాంతో ఇది.. హీరో,విలన్,ఓ సామాజిక సమస్య తో… రొటీన్ సినిమా గానే మిగిలింది. ఫస్టాఫ్ కాలేజ్ సీన్స్ చూస్తూంటే ‘త్రీ ఈడియ‌ట్స్’‌ సినిమా గుర్తుకు వస్తే మన తప్పు కాదు.ఈ సినిమా చూస్తుంటే…`పోకిరి`లో ర‌న్నింగ్ షాట్‌, `భ‌ర‌త్ అనే నేను`, `శ్రీమంతుడు`, `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ర‌ఘువ‌ర‌ణ్ బీటెక్‌`, ర‌జ‌నీకాంత్ – జ‌గ‌ప‌తిబాబు న‌టించిన `క‌థానాయ‌కుడు`… ఇలా చాలా సినిమాలు గుర్తుకొచ్చాయి.ఒక ధనవంతుడు ఇండియాకి వచ్చి ఒక సోషల్‌ కాజ్‌కోసం పోరాడడం విజయ్‌ ‘సర్కార్‌’ని తలపిస్తుంది.`ప్ర‌పంచాన్ని ఏలేద్దామ‌నుకుంటున్నాం సార్‌..` అనే డైలాగు విన్న వెంట‌నే `బిజినెస్ మ్యాన్‌`లో `ముంబ‌య్ ని ఉచ్చ‌పోయించ‌డానికి వ‌చ్చా` అనే డైలాగు ఎంత కాద‌న్నా గుర్తుకొచ్చేస్తుంది. ఫ‌స్టాఫ్ ల‌వ్ సీన్స్‌లో లాజిక్ లేక‌పోవ‌డం..సెకండాఫ్‌లో ప్రారంభ సన్నివేశాలు… పాటలు మైనస్. యాక్షన్‌ దృశ్యాలు శృతిమించాయి. సినిమాకు లెంగ్త్ ఎక్కువ కావటంతో పట్టుగా  కథ నడవదు. చాలా చోట్ల స్లోగా, ప్లాట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మూడు గంటలను సినిమాలో దాదాపు అరగంట వరకూ ట్రిమ్ చేయోచ్చేమో అనిపిస్తుంది. `రైతుల మీద సింప‌తీతో కాదు, రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నా`, ‘స‌క్సెస్‌కు ఫుల్‌స్టాప్‌లుండ‌వు, కామాలు మాత్ర‌మే’.. అనే తరహా డైలాగులు బాగున్నాయి. అయితే అవి కొన్ని చోట్ల స్పీచ్ లుగా, కొటేషన్స్ మారిపోయాయి. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ ఫైట్‌,అక్క‌డ‌క్క‌డా వచ్చే ఇన్‌స్పిరేష‌న‌ల్ సీన్స్‌,ప్రీ క్లైమాక్స్‌ బాగున్నాయి.క్లైమాక్స్ లో రైతు స‌మ‌స్య‌ల‌ను విశ్లేషించిన తీరు బావుంది.
నట, సాంకేతిక వర్గం…
విద్యార్థిగా, కంపెనీ సీఈఓగా, రైతుగా మ‌హేష్ ఇందులో మూడు పాత్ర‌ల్లో క‌నిపించారు. ఆ పాత్రల శైలిలోనూ, గెట‌ప్పుల్లోనూ చూపించిన వైవిధ్యం బావుంది. ఆయ‌న చూపించిన కొన్ని కొన్ని మేన‌రిజ‌మ్స్ పండాయి. నరేష్ పాత్రలో మరింత ఎమోషనల్ డెప్త్ కావాలనిపిస్తుంది. పెద్ద ఇనుప పెట్టె పట్టుకుని ఐఐఈటీ కు రావటం,రూమ్ లో గుగ్గిలం పొగవెయ్యటం వంటి అంశాలు నవ్వు వస్తుంది. ఈ రోజుల్లో అందునా అంత పెద్ద కోర్స్ చేద్దామని వచ్చేవాడు అంత అమాయకంగా ఉంటాడా అనిపిస్తుంది. అయితే నరేష్ తన పాత్రకు న్యాయం చేసాడు. ఊరి పెద్ద‌గా సాయికుమార్‌, న‌రేష్ తండ్రిగా త‌నికెళ్ల భ‌ర‌ణి, పొరుగూరి వ్య‌క్తిగా రాజీవ్ క‌న‌కాల చ‌క్క‌గా క‌నిపించారు. మ‌హేష్ అమ్మానాన్న‌లుగా జ‌య‌సుధ‌, ప్ర‌కాష్‌రాజ్ సహజంగానే బాగా చేసారు.పూజా హెగ్డే ఫ‌స్టాఫ్‌లోనూ, పాట‌ల్లోనూ గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది. సెకండాఫ్‌లో ఆమెకు పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమాలో మరోసారి కార్పోరేట్ విలనిజంతో చెలరేగిపోయారు. చాన్నాళ్ల త‌ర్వాత ముఖేష్ రుషి తెలుగు తెర‌పై క‌నిపించారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కోట శ్రీనివాస‌రావు ఒక్క సీన్‌లోనే క‌నిపించినా బాగుంది.
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరినట్లుగా పాటలు కుదరలేదు. కేయు మోహనన్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. అమెరికా సీన్స్‌తో పాటు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. దాదాపు మూడు గంటల నిడివి ప్రేక్షకులను బోర్‌ ఫీల్‌ అయ్యేలా చేసింది – రాజేష్