మహేష్ నిర్మాతగా విజయ్ సినిమా?

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో హీరోగా నటిస్తూ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ స్టార్ హీరో ప్రారంభించిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉంది. కాగా ఇదే బ్యానర్‌లో పలువురు యంగ్ హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్మాణ బాధ్యతలు ఆయన భార్య నమ్రత పర్యవేక్షణలో జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇదే బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మధ్య ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను కూడా మహేష్‌తో కలిసి చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నాడట. అయితే ప్రస్తుతానికి ఆ సినిమా వివరాలేం తెలియవు కానీ… ఇదివరకే ఇదే బ్యానర్‌లో మరో యంగ్ హీరో అడవిశేష్ ‘మేజర్’ సినిమా ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం మైత్రి మూవీస్ బ్యానర్‌లో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే బ్యానర్‌లో మరో సినిమాకు విజయ్‌కు కమిట్‌మెంట్ ఉంది. అయితే ఈ యంగ్ హీరో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా చేస్తాడా లేదా మైత్రి వాళ్లతోనే మరో సినిమా చేస్తాడా అనేది చూడాలి.