వినోదానికి… ‘సరిలేరు నీకెవ్వ‌రు’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు సమర్పణలో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రామబ్ర‌హ్మం సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధాంశం… స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాదుల‌తో పోరాడుతూ ఆర్మీ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ (మ‌హేశ్‌) దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మ‌రో వ్య‌క్తి(స‌త్య‌దేవ్‌) జాయిన్ అవుతాడు. ఓ టెర్ర‌రిస్ట్ ఎటాక్‌లో అజ‌య్(స‌త్య‌దేవ్‌) బాగా గాయ‌ప‌డ‌తాడు. అత‌ను త్వ‌ర‌లోనే చ‌నిపోతాడు కాబ‌ట్టి.. ఆ విష‌యాన్ని అత‌ని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణ‌యించుకుంటుంది. అజ‌య్ త‌ల్లి భార‌తి(విజ‌య‌శాంతి) మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి. త‌న పెద్ద‌కొడుకు ఆర్మీలో చ‌నిపోయిన‌ప్ప‌టికీ చిన్న‌కొడుకు ఆర్మీకి పంపుతుంది. కొన్ని విలువ‌ల ప్ర‌కారం భార‌తి చెల్లెలి పెళ్లి చేయ‌డానికి అత‌ని స్థానంలో మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌, ప్ర‌సాద్‌(రాజేంద్ర ప్ర‌సాద్‌)తో క‌లిసి క‌ర్నూలు బ‌య‌లుదేరుతాడు. ట్రెయిన్‌లో సంస్కృతి(ర‌ష్మిక‌).. కుటుంబంతో క‌లిసి ప్ర‌యాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న‌(రావు ర‌మేశ్‌) ఇష్టం లేని పెళ్లి చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో ఆమె మేజ‌ర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డి, ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంది. వారి నుండి త‌ప్పించుకుని అజ‌య్ క‌ర్నూలు చేరుకుంటాడు. అక్క‌డ భార‌తి, వాళ్ల కుటుంబం క‌న‌ప‌డ‌దు. ఆమెను మంత్రి నాగేంద్ర‌(ప్ర‌కాశ్ రాజ్‌) చంప‌డానికి ప్రయ‌త్నిస్తుంటారు. వారి బారి నుంచి భార‌తిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌. అస‌లు నాగేంద్ర‌తో భార‌తికి ఉన్న వైరం ఏంటి ? మేజ‌ర్ అజయ్ కృష్ణ‌ భార‌తి స‌మ‌స్య‌ను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…

విశ్లేషణ…‘పటాస్’ నుంచి తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో.. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో చెప్పుకోదగిన స్దాయిలో క‌థ లేదు. అనిల్ గత చిత్రాలు హిట్ అయినా.. ఆయ‌న ఎంచుకునే క‌థ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేక తేలిపోయాయి. థియేటర్ లో కూర్చున్నంతసేపు …కామెడీ చేస్తూ… హీరో హీరోయిన్ల‌కి కొన్ని మ్యాన‌రిజ‌మ్స్ పెట్టి ఎంగేజ్ చేస్తూ..కొంత అదృష్టం కలిసొచ్చి నడిపించేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు తో చేసేటప్పుడు సరిచేసుకుని బలమైన స్క్రిప్టు రాసుకుంటాడని ఆశిస్తాం .కానీ అనిల్ రావిపూడి లో మార్పులేదు. మహేష్ బాబు ఇమేజ్ పై ఆధారపడి .. ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో.. అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నడిపించారు. ట్రైన్ ఎపిసోడ్ కథలో భాగం కాకపోయినా బాగానే నవ్వించింది..అయితే సాగదీసే సరికి విసుగొచ్చింది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఎపిసోడ్ తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా లేచింది. అయితే సెకండాఫ్‌లో ఆ ప్లో మెయింటైన్ చేయలేకపోయారు .దాంతో సెకండాఫ్ కాస్త స్లో అయింది. విల‌నిజాన్ని బిల్డ‌ప్ చేసిన తీరు బాగానే అనిపించినా.. స‌స్ట‌యిన్ చేయ‌లేక పోయారు .క్లైమాక్స్ కు వచ్చేసరికి స్పీడ్ పడిపోయి.. సినిమాకు తగిన క్లైమాక్స్ సమకూర్చలేక పోయారు. అయితే ‘మైండ్ బ్లాక్’ సాంగ్ సరైన టైమ్ లో పెట్టడం,మహేష్‌బాబు లుంగీ కట్టుకుని చేసిన మాస్‌ డాన్సులు ఫాన్స్‌కి కనువిందు చేస్తాయి.కొండారెడ్డి బురుజు సెంట‌ర్‌ ప్ర‌కాశ్ రాజ్, మహేష్ కు మ‌ధ్య వ‌చ్చే సీన్…
విజయశాంతి, మహేష్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.భారీ స్టార్ కాస్ట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ సినిమాకు ఓ రిచ్ లుక్ తెచ్చాయి.
 
నటీనటులు… మహేష్ ‘ఒన్ మ్యాన్ షో’గా సినిమాను న‌డిపించాడు. మిలిట్రీ ఎపిసోడ్స్ లో,ట్రైన్ ఎపిసోడ్ లో కామెడీ ,ఎమోషనల్ బ్లాక్ లలో తనేంటో చూపించాడు. మహేశ్‌ ఎంట్రీ సీన్‌, యాక్షన్‌ పార్టులోనూ, తమన్నాతో ‘డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌’లో ఎనర్జిటిక్‌ స్టెప్పుల తోనూ అలరించాడు. మ‌హేష్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే డాన్స్ స్టెప్స్‌ బాగా డిజైన్ చేశారు. రష్మిక చేత ఓవర్ యాక్షన్ చేయించారు. హీరో మీదకి ఎగబడిపోతూ కనిపించే సీన్లు మరీ డ్ర‌మ‌టిక్‌గా ఉన్నాయి.
చాలా కాలం తర్వాత తెరపై విజ‌య‌శాంతి క‌నిపించారు. యాక్టింగ్‌లోనూ, డైలాగు డెలివ‌రీలోనూ ఆమె గ్రేస్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బండ్ల గ‌ణేష్ సీన్ న‌వ్వించింది. సంగీత‌, రావు ర‌మేష్ పాత్ర‌ల‌న్నీ బావున్నాయి. పాట‌లు కూడా స్క్రీన్ మీద క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. సంగీత కూడా పాత్రకు తగ్గట్లు బాగా చేసింది.ఓ కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన హావభావాలతో నవ్విస్తారు.అలాగే ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
 
సాంకేతికం… సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ..రెండు పాటలు ఇప్పటికే పెద్ద హిట్. పాటలు ఆడియో పరంగా కంటే .. సినిమాలో విజువల్ గా బాగున్నాయి. పాటలు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది . రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. టెర్ర‌రిస్ట్ ఎటాక్ నుండి పిల్ల‌ల‌ను కాపాడే ఫైట్‌.. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో ఫైట్‌ చాలా చ‌క్క‌గా డిజైన్ చేశారు. త‌మ్మిరాజు ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది – రాజేష్