మహేష్‌-సుకుమార్‌ సినిమా అందుకే ఆగిపోయింది !

మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సుకుమార్‌ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’ చిత్రంలో మహేష్‌ నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందింది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, సూపర్‌స్టార్‌ కోసం సుకుమార్‌ ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాను సుకుమార్‌తో కలిసి పనిచేయడంలేదని మహేష్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు…
“కొన్ని కారణాల వల్ల సుకుమార్‌తో నేను సినిమా చేయడంలేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సందర్భంగా ‌ విషెస్‌ చెప్పాలనుకుంటున్నాను. అద్భుతమైన ప్రతిభ ఉన్న ఓ దర్శకుడిని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఆయన దర్శకత్వంలో నేను నటించిన ‘నేనొక్కడినే’ క్లాసిక్‌ చిత్రంగా నిలిచిపోతుంది. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. మీరు తీస్తున్న కొత్త సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ సర్‌..” అని పేర్కొన్నారు మహేష్‌.
 
ఈ ట్వీట్ అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఎందుకు ఈ ఇద్దరి సినిమా ఆగిపోయిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు స్వయంగా ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అని చెప్పాడు కాబట్టి… దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ ఆల్ మోస్ట్ 3 స్టోరీ లైన్స్ మహేష్ బాబుకి చెప్పాడట. ఈ మూడు కూడా మహేష్ బాబుకి నచ్చలేదని సమాచారమ్. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్‌. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేస్తాడు.
మరోపక్క మహేష్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోవటంతో వెంటనే సుకుమార్ మరో సినిమాను ప్రకటించాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుకుమార్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కబోయే హ్యాట్రిక్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ ఆ సినిమా తరువాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు.