వేరే వారి సినిమాతో పోల్చకూడదనే రీషూట్ ?

మహేశ్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ కథ  రానా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ను పోలి ఉందనే పుకార్లు కొన్ని ఫిల్మ్‌నగర్‌లో షికార్లు చేస్తున్నాయి. దాంతో  దర్శకుడు రీ-షూట్ చేసే ఆలోచనలో పడ్డాడట. రానా ‘లీడర్’లో ముఖ్యమంత్రి తనయుడిగా నటించాడు. తండ్రి మరణంతో అనివార్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అవుతాడు. అయితే అవినీతి రహిత సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రానా సిద్ధపడతాడు. మహేశ్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ కథ కూడా దాదాపుగా ఇలానే ఉందని కొందరంటున్నారు.’భరత్ అనే నేను’లో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మహేశ్ సైతం రాజకీయాల్లోకి వస్తాడట. ఆ తర్వాత సి.ఎం. అవుతాడట. అతనిపై చిత్రీకరించిన అసెంబ్లీ సన్నివేశాలు కొన్ని చూస్తుంటే. రానా ‘లీడర్’లోని సీన్స్‌కు దగ్గరగా ఉన్నాయని కొందరు సందేహం వెలిబుచ్చారట.
దాంతో దర్శకుడు కొరటాల శివ వాటిని తిరిగి రాయాలని భావించారట. ఇప్పటికే ‘శ్రీమంతుడు’లో తన కలం బలం చూపించిన కొరటాలకు ఇదేమీ బ్రహ్మవిద్య కాదని, మరింత పదనుగా ఆయన ఆ సన్నివేశాలను రాస్తున్నారని అంటున్నారు.’మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాను వేరే వారి సినిమాతో పోల్చుకుంటే కష్టం’ అనే భావన దర్శక నిర్మాతలకు వచ్చిందట. అలాంటి వ్యాఖ్యలకు ఆస్కారం ఇవ్వడం ఇష్టంలేని వీరు రీ- షూట్‌కు సైతం సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే ‘రోబో’ సీక్వెల్ విడుదల కారణంగా ‘భరత్ అనే నేను’ సినిమాను రెండు వారాల ముందుకు ప్రీపోన్ చేసినట్టూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రీషూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళేందుకు టీమ్ నిర్విరామంగా కృషి చేస్తోందట. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’తో హ్యాట్రిక్ కొట్టిన కొరటాల శివ ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్‌కు ‘భరత్ అనే నేను’తో శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడు.