మహేష్ ‘భరత్’ మరింత ముందుకు?

రజినీకాంత్ భారీ చిత్రం ‘2.0’ చిత్ర విడుదల  మళ్ళీవాయిదా పడి  ఏప్రిల్ కి మారినట్లు ప్రకటించడంతో ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటున్న సినిమాల నిర్మాతలలో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా ఈ విషయంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాల నిర్మాతలు 2.0పై యుద్ధానికి రెడీ అవుతున్నారని, 2.0కి ధియేటర్ల విషయంలో వీరు టాలీవుడ్ పవర్ చూపించాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు తాజాగా వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ రేస్‌లో నుండి కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ‘భరత్ అనే నేను’ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27న విడుదల అనుకుంటున్న ఈ చిత్రాన్ని కాస్త ముందుకు అంటే ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏకధాటిగా కొనసాగుతున్న పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా వేగవంతం చేశారట.
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మాత్రం ఇప్పటికీ  ఏప్రిల్ 27నే విడుదల తేదీగా ఉంది. 2.0 కరెక్ట్ డేట్‌ని ప్రకటిస్తే ఈ రెండు చిత్రాలలో దేనిపై ప్రభావం ఎక్కువ పడుతుందనే క్లారిటీ వస్తుందని, ప్రస్తుతానికి మహేష్, అల్లు అర్జున్ ఇలా ఫిక్స్ అయ్యారని  తెలుస్తోంది.