మహేష్ బాబు ‘ఎఎంబి సినిమా’ మెగా మల్టీప్లెక్స్ ప్రారంభం !

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి ఏరియా కొండాపూర్ లో  ‘ఎఎంబి సినిమా’  పేరుతో నిర్మించి ఈ మెగా మల్టీప్లెక్స్ ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఎఎంబి అంటే ‘ఏసియన్ మహేష్ బాబు’ అని అర్థం. ఏసియన్ సినిమాస్‌ సంస్థతో కలిసి మహేష్ బాబు దీన్ని నిర్మించారు. ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేలా అధునాత హంగులతో  ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు.
 
ఎన్ని థియేటర్లు? సీట్ల సామార్థం ఎంత?
మొత్తం 7 థియేటర్లు, 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్‌కు కనీసం రూ. 200 ఖర్చు చేయాలి. ప్లాటినమ్ కేటగిరీలో పరిమిత సంఖ్యలో కొన్ని సీట్లు ఉన్నాయి. అందులో కూర్చుని సినిమా చూడాలంటే ఇంకా ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.
 
ప్రత్యేకతలు ఏమిటి?
ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకత లేజర్ ప్రొజెక్షన్‌, 4డి సౌండ్ టెక్నాలజీ. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుందట. స్క్రీన్‌తో పాటు సౌండ్ క్వాలిటీ ప్రపంచ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ సరికొత్త థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు తెలుగు సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
 
అందరి చూపు ఇటు వైపే
ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్ అన్నింటినీ వెనక్కి నెట్టి అద్భుతమైన ఇంటీరియ్ డిజైనింగ్, సూపర్ లుక్‌తో ‘ఎఎంబి సినిమాస్’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
 
సినీ సెలబ్రిటీల్లోనూ ఆసక్తి
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు…. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ‘ఎఎంబి సినిమాస్’ను సందర్శించేందుకు, ఇందులో సినిమా చూసి వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు ఆరాట పడుతున్నారు.