స్పై యాక్షన్ థ్రిల్లర్ ….. ‘స్పైడర్’ చిత్ర సమీక్ష

                                        సినీవినోదం రేటింగ్ : 2.5/5

ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ దర్శకత్వం లో ఎన్‌.వి. ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు .

శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని ఆపదలో ఉన్నవారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. జనం మాట్లాడే ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే, త‌న‌కు అల‌ర్ట్ వ‌చ్చేలా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో షాక్ కి గురైన శివ దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు.

 భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటాడు . జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారు. వారిని పట్టుకునే ప్రయత్నం లో …. హాస్పిట‌ల్‌లో ఉన్న పేషెంట్స్ ప్రాణాల‌తో భైర‌వుడు ఆడుకోబోతున్నాడనే విషయం తెలుస్తుంది . వారి బారి నుండి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందనేది సినిమాలో చూడాలి ….

మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు, అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు…. అనే మురుగదాస్ ఎంచుకున్న కథాంశం హర్షించదగిందే. అయితే, సహజం గా మురుగ‌దాస్ సినిమాల్లో బ‌ల‌మైన క‌థ, క‌థ‌నం ఉంటాయి. ఈ సినిమాలో అవి క‌న‌ప‌డ‌వు. ప్రేక్షకుల‌ను ఆస‌క్తితో క‌ట్టిప‌డేసే స‌న్నివేశాల‌ను అందంగా మ‌ల‌చ‌గ‌ల ద‌ర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒక‌టి రెండు సన్నివేశాలు మిన‌హా ర‌క్తి క‌ట్టించ‌లేక‌పోయారు .మహేష్ ను స్టైలిష్ కాప్ గా బాగానే చూపించాడు. అయితే తెలుగునాట మహేష్ ఇమేజ్ కు తగ్గ కథా కథనాలను ఎంపిక చేయటంలో తడబడ్డాడు. మహేష్ పాత్రకు ఒక స్టార్ హీరోకు ఉండాల్సినంత ఎలివేషన్ లేకపోవడం మైనస్ అయ్యింది . ఫస్టాఫ్ లో విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం, అతనెందుకు అలా తయారయ్యాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాల్ని బలంగా చూపించారు. ఆ పాత్రలో ఎస్.జె సూర్య వంటి నటుడ్ని ఎంచుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు . మహేష్ కి అతనికి మధ్య నడిచే సంభాషణలు, పోరాట సన్నివేశాలు బాగున్నాయి. తొలి భాగం కాస్త స్లో అయినా.. ద్వితీయార్థం మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్ లతో కథను నడిపించాడు . అయితే, తెలుగు నేటివిటి పెద్దగా కనిపించకపోవటం ఇబ్బంది కలిగించింది . అలాగే సెకండాఫ్ లో నడిచే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ బాగున్నా… కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ లో విలన్ చావు కూడా థ్రిల్లింగ్ గా లేకపోవడం తో భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకి నిరాశ కలిగింది . హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆకర్షణీయంగా లేదు. ప్రీ క్లైమాక్స్ సీన్‌లో విల‌న్‌ను ప‌ట్టుకునే సంద‌ర్భంలో రియాలిటీ షో లాంటి స‌న్నివేశం, రోల‌ర్ కోస్టర్ ఫైట్ సీన్ బావుంది. తల్లిని తమ్ముడిని తెలివిగా కాపాడుకునే సన్నివేశం బాగా చేశారు . భారీ బండరాయి సీన్ , క్లైమాక్ లో హాస్పిటల్ సీన్స్ భారీ గా చిత్రీకరించారు .
మ‌హేష్ న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఎప్పటిలా ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, న‌ట‌న‌తో ఆకట్టుకున్న మ‌హేష్ తెర‌పై చాలా అందం గా క‌న‌ప‌డ్డాడు. విల‌న్‌తో క్లైమాక్స్ ముందు జ‌రిగే సంభాష‌ణ స‌న్నివేశంతో పాటు విల‌న్‌ను పోలీసులకు లేడీస్ ప‌ట్టించే స‌న్నివేశంలో కూడా మ‌హేష్ న‌ట‌న మెప్పిస్తుంది. ర‌కుల్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు. కేవ‌లం పాట‌ల‌కు మాత్రమే ప‌రిమితం అయ్యింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర విల‌న్‌గా న‌టించిన ఎస్‌.జె.సూర్య‌. పూర్తి స్థాయి విల‌న్‌గా ఎస్‌.జె.సూర్య న‌ట‌న మెప్పించింది. ఒక సైకిక్ గా సూర్య తన హావ‌భావాలతో పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . అలాగే భ‌ర‌త్ పాత్ర ప‌రిమిత‌మే అయినా, ఉన్నంతలో త‌న పాత్రను బాగా పోషించాడు . ఇజ జ‌య‌ప్రకాష్‌, షియాజీ షిండే వారి పాత్ర‌ల‌ను బాగా చేశారు. మ‌హేష్ స్నేహితులుగా ప్రియ‌ద‌ర్శి, ఆర్‌.జె.బాలాజీ ఓకే.
హారిస్ జయరాజ్ అందించిన ట్యూన్స్ బాగా లేవు. ట్యూన్స్ కి త‌గ్గ సాహిత్యం కుద‌రలేదు. విజువల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం హారిష్ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సరికొత్త తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ప్రతీ స‌న్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు. యాక్షన్ సీన్స్ లో సినిమాటోగ్రఫి చాలా బాగుంది . అలాగే స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్స్ లో ఒకటిగా నిలిచాయి. కీలక సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ స్టాండర్డ్స్ తో ఉన్నాయి. శ్రీక‌ర్ ప్రసాద్‌ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి – రవళి