యువనాయిక వేధింపుల కేసులో హీరో అరెస్ట్‌

తెలుగుతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయిక భావనను కారులో లైంగికంగా వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్‌ కేసులో దిలీప్‌ నిందితుడిగా ఉన్నారు. ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్‌ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

దిలీప్‌ను “అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్”(అమ్మ) బహిష్కరించింది!

కోలీవుడ్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాతి స్థానాన్ని సంపాదించిన స్టార్ హీరో దిలీప్‌ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) బహిష్కరించింది. ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్ అరెస్టయిన కొన్ని గంటలకే ‘అమ్మ’ ఈ నిర్ణయం తీసుకుంది. మలయాళ సుపర్‌స్టార్ ముమ్మట్టి నివాసంలో ‘అమ్మ’ కమిటీ సభ్యులు మంగళవారం అత్యవసర సమావేశమయ్యారు. ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముమ్మట్టి ఆధ్వర్యంలో దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కోశాధికారి పదవి నుంచి కూడా అతడిని తొలగించినట్లు మీడియా ముందు ప్రకటించారు. బాధిత నటికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ… కేసు విచారణలో ప్రభుత్వ, పోలీసుశాఖ పనితీరును ప్రశంసించారు.‘అమ్మ’ బాటలోనే కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కూడా దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశాయి.