నన్ను కిడ్నాప్‌ చేసిందెవరో ఇప్పుడు చెప్పను !

 “మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌” నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్‌ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్‌ కూడా ఉంది.’పూ’, ‘బెంగుళూర్‌ డేస్‌’ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి…

మలయాళ నటి పార్వతీ మీనన్‌ “నేనూ అలాంటి బాధితురాలినే” అని అంటున్నారు. 

నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ….సహ నటి కిడ్నాప్‌నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్‌ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్‌ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, జాగ్రత్తగానూ వ్యవహరించాలని పార్వతీమీనన్‌ చెప్పారు.
సీనియర్‌ నటీమణుల ప్రకటన
‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ తరపున 15 మంది సీనియర్‌ నటీమణులు తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అమ్మలో చేరబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు….
‘అమ్మపై నమ్మకం పోయింది. ఎట్టిపరిస్థితుల్లో అందులో చేరబోం. న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఇంక అసోషియేషన్‌ను నమ్మే ప్రసక్తే లేదు’ అంటూ.. వారంతా ప్రకటనలో పేర్కొన్నారు. నటి అక్కినేని అమలతోపాటు రంజనీ, సజిత మదంబిల్‌, కానీ కుస్రూతీ, శాంతి బాలచంద్రన్‌ తదితరులు అందులో ఉన్నారు. ‘ఇండస్ట్రీల్లో మహిళలను ఆటబొమ్మలుగా చూస్తున్నారని, అమ్మ వైఖరి అప్రజాస్వామ్యికంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలే అమలవుతున్నాయని, తమ తోటి నటి లైంగిక దాడి కి గురైతే.. నిందితుడికి బాసటగా నిలిచే నిర్ణయం తీసుకుందని, సమాన వేతన చట్టం అమలు కావటంలేదని.. ఇలా ఎనిమిది కారణాలతో కూడిన ఓ లేఖను డబ్ల్యూసీసీ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు . మహిళల పట్ల వివక్షత పోయి.. సినిమా అంటే ప్రజలు ఓ మాధ్యమంగానే చూసే రోజులు రావాలని తాము కోరుకుంటున్నట్లు వారు లేఖలో తెలియజేశారు.