నేతన్నల జీవితానికి అద్భుత దృశ్యరూపం ‘మల్లేశం’

సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, స్టూడియో 99 బ్యానర్ లపై రాజ్‌.ఆర్‌ దర్శకత్వం లో రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి ఈచిత్రాన్ని నిర్మించారు.
చేనేతకారులు అనాదిగా బ్రతుకు ప్రవాహానికి ఎదురీదుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక వారి శ్రమ నిష్పలమవుతున్నది. చేనేతకారుల బ్రతుకు చిత్రానికి అద్దం పడుతూ, ఆసు యంత్ర రూపకర్త చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం చిత్రాన్ని రూపొందించారు. చేనేత వస్త్రాల తయారీలో ఆసు పోయడం తీవ్రమైన శారీరక శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఒక్క చీరను నేయడానికి దాదాపు 9000వేల సార్లు ఆసు యంత్రంపై చేతిని తిప్పాల్సి ఉంటుంది. దీంతో ఆసుపోసే ఎందరో మహిళలు ఎముకలు అరిగిపోయి అనారోగ్యానికి గురయ్యేవారు. ఆసు పోస్తూ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన చింతకింది మల్లేశం ఆసు యంత్ర తయారీకి పూనుకుంటాడు.ఆరో తరగతిలోనే చదువుకు స్వస్తిపలికిన మల్లేశం అకుంఠిత దీక్షతో, సడలని సంకల్పంతో..అనేక అవమానాల్ని, కష్టనష్టాల్ని ఎదుర్కొని ఆసుయంత్రాన్ని తయారుచేస్తాడు. అసాధారణ ప్రతిభకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నాడు మల్లేశం. చేనేత పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికిన ఆసుయంత్ర రూపశిల్పి చింతకింద మల్లేశం జీవిత కథని మల్లేశం పేరుతో వెండితెరపైకి తీసుకొచ్చారు. సంకల్పబలానికి సాక్షీభూతంగా, ఓ సామాన్యుడి స్ఫూర్తిదాయక ప్రయాణానికి దృశ్యరూపంగా ఈ బయోపిక్ రూపొందించారు.నేతన్నల జీవితానికి అద్భుత దృశ్యరూపంగా నిలిచింది. సంకల్పబలం, కష్టాలకు వెరవని తత్వం ఉంటే సామాన్యులు సైతం మహత్తర లక్ష్యాన్ని సాధించవొచ్చనే గొప్ప సందేశాన్నిచ్చింది.
 
కధాంశం… నల్గొండ జిల్లాలోని ఓ చిన్నగ్రామం శారాజీపేట. అక్కడ చాలా కుటుంబాలకు చేనేత వృత్తి జీవనాధారం. అయితే శ్రమకు తగిన ఫలితం లభించక ఎంతో మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మల్లేశం కుటుంబం కూడా చేనేత వృత్తి మీదనే జీవనం సాగిస్తుంటుంది. చదువంటే ఇష్టం ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆరోతరగతిలోనే చదువు మానేస్తాడు మల్లేశం. తండ్రి ఆదేశంతో మగ్గం మీద పనిచేస్తుంటాడు. ఆసుపోస్తూ తల్లి లక్ష్మి (ఝాన్సీ) పడే రెక్కల కష్టం చూసి మల్లేశం చలించిపోతాడు. ఆసు పోయడం మానుకోకపోతే భుజం పనిచేయని పరిస్థితి వస్తుందని డాక్టర్ లక్ష్మికి సలహా ఇస్తాడు. దీంతో ఎలాగైనా అమ్మ కష్టాలను దూరం చేయాలని నిశ్చయించుకుంటాడు మల్లేశం. చిన్నతనం నుంచే కొత్త విషయాల్ని కనుగొనడం పట్ల ఆసక్తిని ప్రదర్శించే మల్లేశం ఆసు యంత్రాన్ని తయారుచేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఊరిలో అప్పులు చేస్తాడు.
 
ఆసు యంత్రం తయారీలో మల్లేశం ప్రయత్నాల్ని చూసి ఊళ్లోవాళ్లందరూ అవహేళన చేస్తారు. పెళ్లి చేస్తేనే మల్లేశం ఇలాంటి పనులు మానుకొని దారిలోకి వస్తాడని తల్లిదండ్రులు భావిస్తారు. తాను ప్రేమిస్తున్న మరదలు పద్మ (అనన్య)తో పెళ్లి కుదర్చడంతో మల్లేశం సంతోషంగా అంగీకరిస్తాడు. భార్య కూడా ప్రోత్సహించడంతో ఆసు యంత్రం తయారీ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాడు మల్లేశం. ఈ క్రమంలో ఓసారి ఆసు యంత్రాన్ని పరీక్షిస్తుండగా మోటార్ పేలిపోతుంది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులందరూ మల్లేశంను మందలిస్తారు. అప్పుల వాళ్లు అప్పు తీర్చాల్సిందే అంటూ హెచ్చరిస్తారు. చివరకు డబ్బుల విషయంలో భార్యతో కూడా గొడవ పడతాడు మల్లేశం. ఓ వైపు ఆసు యంత్రం వైఫల్యం, మరోవైపు అప్పుల బాధ, కుటుంబ సభ్యుల మందలింపుతో ఆత్మహత్య కు పూనుకుంటాడు మల్లేశం. ఆసు యంత్రం తయారీలో అడుగడుగునా అనేక ఛీత్కారాలు ఎదుర్కొన్న మల్లేశం చివరకు ఎలా విజయం సాధించాడు? అసాధ్యం అనుకున్న ఆవిష్కరణను ఎలా సుసాధ్యం చేశాడన్నదే ఈచిత్ర కథ..
విశ్లేషిస్తే… బయోపిక్ లు ప్రేక్షకుల మనసుకు హత్తుకోవాలంటే ఆ వ్యక్తి జీవితాన్ని సహజంగా ఒడిసిపట్టగల నేర్పు ఉండాలి. దర్శకుడు రాజ్ ఆర్ ఈ విషయాల్లో సఫలీకృతుడయ్యారు. 90వ దశకంలో జరిగే కథ ఇది. నాటి పరిస్థితుల్ని యథాతథంగా కళ్లకు కట్టిన భావన కలుగుతుంది. తెలంగాణ మారుమూల పల్లె వీధుల్లో విహరిస్తూ అక్కడి మట్టిమనుషులతో సంభాషిస్తున్న అనుభూతికి లోనవుతాం. మల్లేశం బాల్యం మొదలుకొని, అతని ప్రేమాయణం, ఆసు యంత్రం తయారీలో ఎదుర్కొన్న కష్టనష్టాల్ని అందంగా, భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు.
 
పాఠశాలలో మల్లేశం మిత్రులు చేసే హంగామా మంచి వినోదాన్ని పండించింది. తల్లి పడుతున్న కష్టాల్ని చూసి చలించిన మల్లేశం ఎలాగైనా ఆసుయంత్రాన్ని తయారు చేయాలనుకోవడం, ఈ క్రమంలో ఊరి వాళ్లనుంచి ఎదురైన అవహేళనలు, అప్పుల వాళ్ల బెదిరింపులు..చివరకు మల్లేశం ఆత్మహత్యకు పూనుకోవడం..ఈ ఘట్టాలతో ప్రథమార్థమంతా ఎమోషనల్గా సాగింది. తండ్రి నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నా… మల్లేశం తన అభిలాషను వదులుకోకుండా ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు తల్లి ఎప్పుడూ మల్లేశం వైపు నిలబడి ప్రోత్సహిస్తుంటుంది. ఈ ముగ్గురు మధ్య హృదయాల్ని స్పృశిస్తూ సాగే సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. అప్పుల బాధ తట్టుకోలేక మల్లేశం ఊరు విడిచి తన భార్యను తీసుకొని హైదరాబాద్ వస్తాడు.
 
ఈ క్రమంలో బ్రతుకు పోరులో భార్యతో కలసి మల్లేశం పడిన కష్టాలు, వైఫల్యాలతో చుట్టూ అలుముకున్న నైరాశ్యం, లౌక్యం తెలియని మల్లేశం మనస్తత్వాన్ని ద్వితీయార్థంలో హృదయం గా ఆవిష్కరించారు. ఇన్ని సంఘర్షణల నడుమ కూడా మల్లేశం ఆస్త్రసన్యాసం చేయకుండా నిరంతరం పరిశ్రమించడం స్పూర్తివంతంగా ఉంది. మల్లేశం, భార్య పద్మ మధ్య అనుబంధాన్నిహృద్యమైన సన్నివేశాలతో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ఆద్యంతం మల్లేశం జీవితంతో ప్రేక్షకులు సహానుభూతిచెందేలా చేయడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యారు.
 
సన్నివేశాల రూపకల్పనలో కొంత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ ఎక్కడా వాస్తవికతకు దూరంగా వెళ్లకపోవడం ఈ చిత్రంలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ చేయడంవల్ల ప్రతి సన్నివేశంలో సహజత్వం ప్రతిఫలించింది. మల్లేశం పెళ్లి ఘట్టాలు, పీరీల పండుగ తాలూకు సన్నివేశాల్లో పల్లె తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాల్ని గొప్పగా చూపించారు. గ్రామీణ తెలంగాణ సిసలైన సౌందర్యాన్ని, అక్కడి శ్రమ జీవితాన్ని యథార్థ కోణంలో ఆవిష్కరించిన విధానం ప్రధానాకర్షణగా నిలిచింది. అయితే క్లైమాక్స్ ఒక్కసారిగా ముగించారనే భావన కలుగుతుంది.ఈ విషయం లో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. మొత్తంగా ఓ సామాన్యుడి అసాధారణ ప్రయాణం, అద్వితీయ విజయానికి దృశ్యరూపంగా మల్లేశం చిత్రాన్నిచెప్పొచ్చు.
నటవర్గం… హాస్య పాత్రల ద్వారా సుపరిచితుడైన ప్రియదర్శి ఈ సినిమాలో మల్లేశం పాత్రకు న్యాయం చేశాడు. ఆ పాత్ర సహజంగా సాగింది. ముఖ్యంగా తండ్రి ఆసు యంత్రాన్ని కిరోసిన్ పోసి తగులపెట్టే సన్నివేశంలో ప్రియదర్శి నటన కంటతడిపెట్టిస్తుంది. తండ్రి పాత్రలో ఆనంద చక్రపాణి అద్బుతంగా పోషించాడు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది. ఇక మల్లేశం తల్లి లక్ష్మి పాత్రధారి ఝాన్సీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.
 
సినిమాలో తల్లి కొడుకు సెంటిమెంట్ బలంగా పండటానికి ఝాన్సీ నటనా ప్రతిభనే కారణమైంది. కొడుకు ఉన్నతిని కోరుకుంటూ నిరంతరం సంఘర్షణకులోనయ్యే తల్లిగా ఝాన్సీ తన పాత్రలో జీవించేసింది. మల్లేశం భార్య పద్మ పాత్రలో అనన్య ఆకట్టుకుంది. ఆమె కళ్లు చక్కటి భావాల్ని పలికించాయి. ప్రథమార్థంలో చలాకీ పిల్లగా, ద్వితీయార్థంలో భర్త కష్టాల్లో తోడుండే భార్యగా పాత్రలో మంచి అభినయాన్ని కనబరిచింది. మల్లేశం మామ పాత్రలో లక్ష్మణ్ ఏలె తన పరిధిలో మెప్పించాడు. యూ ట్యూబ్ ‘మై విలేజ్ షో’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ పాత్ర సంభాషణలతోనే వినోదాన్ని పండించింది.
 
సాంకేతికంగా… బాలు శాండిల్య ఛాయాగ్రహణం పల్లె అందాల్ని పట్టి చూపించింది. మార్క్ కె రాబిన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు మంచి ఫీల్ అందించింది. ‘పల్లేఒడిలోనా పిల్లల గుడి ఆట’, ‘ఓహో జాంబియా’ (పీరీల నేపథ్య పాట) బాగున్నాయి . లక్ష్మణ్ ఏలె కళాదర్శకత్వం చాలా బాగుంది. నాటి పరిస్థితుల్ని తెరపై యథాతథంగా ఆవిష్కరించడంలో మంచి ప్రతిభ కనబరిచారు. పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు చక్కటి తెలంగాణ మాండలికంలో హాయిగా వినిపించాయి. దర్శకుడు రాజ్ ఆర్ ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశాడనే విషయం అర్థమవుతుంది. మల్లేశం జీవితంలోని అంతర్మథనాన్ని, తెలంగాణ జీవనంలోని వాస్తవికతను తెరపై తీసుకురావడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యారు