ఆసక్తి కరమే కానీ… ‘మోసగాళ్ళు’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ  బ్యానర్ పై జెఫ్రీ గీ చిన్‌  దర్శకత్వంలో విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ.. అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కవలలు. ఈ ఇద్దరిలో అను, అర్జున్ కంటే పెద్దది. వీళ్ళ నాన్న తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఆయనను ఓ వ్యక్తి మోసం చేయడంతో వీరి కుటుంబం వీధిన పడుతుంది. రాణిగంజ్ లోని ఓ స్లమ్ ఏరియాలో నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తన కుటుంబం కోసం బాగా డబ్బు సంపాదించి ఎలాగైనా కోటీశ్వరులం కావాలనే లక్ష్యంతో కసిగా ఉంటాడు. మంచి లాంగ్వేజ్ స్కిల్‌ ఉన్న అర్జున్ కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తూ అక్కడి డాటా చోరీ చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. ఇతని స్కిల్ చూసి ఏకంగా ఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) భారీ స్కామ్ చేద్దామని ఆఫర్ చేయడం, ఆ ఇద్దరు చేతులు కలిపి డీల్ కుదుర్చుకొని అమెరికన్ల నుంచి డాలర్లు కొల్లగొట్టే అతిపెద్ద స్కామ్‌కి తెరలేపుతారు.

వీరికి అర్జున్ అక్క అను తోడై ఈ భారీ మోసానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) పేరు చెప్పి అమెరికన్ల నుంచి డబ్బు గుంజుతూ మొదలైన వీరి కుంభకోణం ఇంతింతై పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. టాక్స్ పేరుతో అమెరికా ప్రజలను బెదిరిస్తూ 300 మిలియన్ డాలర్స్ (26 వేల కోట్లు) స్కామ్ చేస్తారు. ఈ స్కామ్‌ని ఛేదించే ఆఫీసర్‌గా ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగడం అనేది సినిమాలో ట్విస్ట్. పై ఆఫీసర్ల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అర్జున్ మోసాన్ని బయటపెట్టి చివరకు అరెస్ట్ చేస్తాడు ఏసీపీ కుమార్. ఇదీ ఈ మూవీ కథ..

విశ్లేషణ.. ‘అతిపెద్ద ఐటీ స్కామ్’‌ ఆధారంగా యదార్థ కథను రాసుకున్న మంచు విష్ణు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కించారు. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు? అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. నేటి ప్రపంచంలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించాలనే  ప్రయత్నం బాగుంది. అయితే ఆసక్తికరమైన క‌థ‌ను ఎంచుకున్నా.. దాన్ని తెరపై థ్రిల్లింగ్‌ గా చూపించే విషయంలో చిత్ర దర్శకుడు తడబడ్డాడు. ఇలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తీసేటప్పుడు డీటెయిల్స్ చాలా అవసరం. ఎంత  క్లియర్ గా నెరేషన్ ఉంటే సినిమా తాలూకా ఇంపాక్ట్ అంత బాగుంటుంది. కానీ మేకర్స్ అలాంటివి అంతగా చూపించినట్టు అనిపించదు. మెయిన్ లీడ్ చేసిన పాత్రలను చూపించే ప్రయత్నంలో అనేక లాజిక్స్ మిస్సవుతాయి. క్లైమాక్స్ కూడా ఇంకా క్లారిటీగా ఇచ్చి ఉంటే బాగుండేది.యూ ఎస్ లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్ టి సి), ‘ఎఫ్ బి ఐ’ లాంటి సంస్థల తో చేయించే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా అంత రియలిస్టిక్ గాలేవు. సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ స్థాయి ఎమోషన్స్ కూడా అంతగా లేవు. అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మ‌రోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. స్క్రీన్ ప్లే  ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. అయితే కథను రియాలిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో అట్రాక్షన్.

అర్జున్‌ పాత్రలో మంచు విష్ణు కథానాయకుడిగానే కాకుండా, కథలోని పాత్రలలో ఒకరిగా ఒదిగిపోవడం ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్‌ ఫెలోగా, సీరియస్‌ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. విష్ణు అక్కగా కాజల్‌ చేయడంతో ఆ క్యారెక్టర్‌కే కాదు..  సినిమాకే ఎడ్వాంటేజ్‌ అయింది. వాళ్ళమధ్య సీన్స్‌ చాలా టచ్చింగా అనిపించాయి. కాజల్‌ ఇందులో అనూ పాత్రతో తనలోని యాక్టింగ్‌ మెరిట్‌కి మెరుగుపెట్టినట్టయింది. ఏసిపి పాత్రను సునీల్‌శెట్టి పోషించడంతో ఆ క్యారెక్టరైజేషన్‌ రిచ్‌గానే కాకుండా, షార్ప్‌గా రూపొందడానికి సునీల్‌శెట్టి చాలా హెల్స్‌ అయ్యాడు. నవీన్‌ చంద్ర, నవదీప్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

ఈ సినిమాకు ప్రధాన బలం సామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. కెమెరా పనితనం బాగుంది. హాలీవుడ్ రేంజ్ కాకపోయినా షెల్డన్‌ చౌ విజువల్స్ ఫర్వాలేదనిపించాయి -రాజేష్