గుర్తుంచుకోండి!.. విజేతలు ఎప్పుడూ ఒంటరివారే!!

కంగనా రనౌత్ అనేక కష్టనష్టాలకోర్చి ‘క్వీన్‌’ స్థాయికి చేరుకుంది. ఎంతమంది, ఎన్నిరకాలుగా తనను విమర్శించినా లెక్కచేయక.. పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ గొప్ప నటిగా గుర్తింపు తెచ్చు కుంది. సామాజిక అంశాలు, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సోషల్‌ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ‘ఫైర్‌బ్రాండ్‌’ సోమవారం ఓ స్ఫూర్తిమంతమైన కోట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది…

నువ్వు విఫలమైతే చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను వదిలేస్తారు. పనికిరాని వాళ్లలా మనల్ని చూస్తారు. అసలు ఈ ప్రపంచంలో ఎందుకు బతుకున్నామా? అనే భావన కలిగేలా ప్రవర్తిస్తారు.  ఒకవేళ నువ్వు.. సమస్యలన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తే.. అప్పుడు కూడా నిన్ను వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తారు. నిన్ను లక్ష్యంగా చేసుకుని ఒంటరిని చేసి, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయేలా కుట్రలు చేస్తారు. అయితే.. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం.. విజేతలు ఎల్లప్పుడూ ఒంటరివారే. కాబట్టి మనం ఒంటరిగానే నిలబడాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే.. జయాపజయాలను ఎవరూ నిర్ణయించలేరు. ఏదేమైనా ముందుకు సాగిపోవడమే పని” అని కంగనా రనౌత్‌ తన ఫాలోవర్లలో ధైర్యం నూరిపోశారు.  తన సినీ ప్రయాణాన్ని ప్రతిబింబించే దృశ్యాలతో కూడిన వీడియోను కంగనా ఆదివారం ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. భవద్గీతలో కృష్ణుడు చెప్పింది తాను విశ్వసిస్తానని, చెడులో కూడా మంచిని చూసే స్వభావం తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.

త్వరలో ‘తలైవి’ జయలలిత గా…  దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం ‘తలైవి’. ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను ‘బాహుబలి’ ఫేమ్‌ విజయేంద్ర ప్రసాద్‌ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్‌ దర్శకత్వంలో లిబ్రి మోహన్‌ పిక్చర్స్‌ కర్మ మీడి యా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. దీన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయనున్నట్లు మొదట నిర్మాతలు ప్రకటించారు. కరోనా మళ్లీ విజృంభించడంతో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లోనూ పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. దీంతో ‘తలైవి’  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ..  తలైవి చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తామన్నారు. అంతకుముందు చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో… కెరీర్‌లో మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. సాయి కబీర్‌  ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్‌ పనులను మొదలు పెట్టారు కంగన. లుక్‌ కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ చేయించుకుంటున్నారు. ఈ చిత్రానికి కంగన కూడా ఓ నిర్మాత కావడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో టైటిల్‌ రోల్‌ చేసిన కంగనా రనౌత్‌ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. ఈ సినిమాలు కాకుండా కంగన ‘ధాకడ్‌’, ‘తేజస్‌’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలు చేస్తున్నారు.