అతని తో కలిసి నటించాలని ఉంది !

అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమని ప్రపంచ సుందరి-2017 మానుషి ఛిల్లర్ అన్నారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు….. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ‘పద్మావతి’ మూవీతో వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి ఎందరో మహిళలు ప్రేరణ పొందే అవకాశం ఉందన్నారు ఛిల్లర్.

ఓ సినిమా ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికైతే సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన తనకు లేదని, అయితే బాలీవుడ్ ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’ ఆమీర్ ఖాన్‌తో కలిసి నటించాలని ఉందని ప్రపంచ సుందరి తెలిపారు. ఆమీర్ ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తారని కొనియాడారు. హీరోయిన్లలో మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాను అభిమానిస్తానని చెప్పారు. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడంపై చేపట్టిన ప్రాజెక్టులో కొంతమేరకు విజయం సాధించాను. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమంతో పాటు మహిళలకు సంబంధించిన మరికొన్ని అంశాల్లో నా శాయశక్తులా కృషి చేసేందుకు సహకరించిన హర్యానా ప్రభుత్వానికి ఈ సందర్భంగా మానుషి ఛిల్లర్ ధన్యవాదాలు తెలిపారు.

హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్‌ ఇండియా’ మానుషి ఛిల్లర్‌ ఇటీవల జరిగిన పోటీల్లో మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో నిర్వహించిన 67వ మిస్‌ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్‌  ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.