ఆరొందల కోట్లతో హాలీవుడ్ రేంజిలో….

‘జనతా గ్యారేజ్‌’, ‘మన్యంపులి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్‌లాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒడియన్‌’. వి.ఎ.శ్రీకుమార్‌ దర్శకత్వంలో 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ మోషన్‌ పోస్టర్‌లో 57 ఏండ్ల మోహన్‌లాల్‌ యుక్త వయస్కుడిగా కనిపిస్తుండటం విశేషం. అలాగే ఈ చిత్రం లో మోహన్‌లాల్‌ భిన్నమైన మరికొన్ని గెటప్ లలో కూడా కనిపిస్తారు . ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు .

ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాదు మోహన్‌లాల్‌ యంగ్‌గా కనిపించడంతో ఎవరీ కుర్రాడని సామాజిక మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో మోహన్‌లాల్‌ “ఒడియన్‌ మాణిక్యన్‌” అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోహన్‌లాల్‌ భీముడిగా నటించబోయే వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం ‘మహాభారత’ చిత్రానికి కూడా ఈ చిత్ర దర్శకుడు శ్రీకుమార్‌ దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. మోహన్‌లాల్‌ ఈ చిత్రంతోపాటు ‘విలన్‌’, ‘వెలిపాడింటె పుస్తకం’ చిత్రాల్లో నటిస్తున్నారు.