క్లాస్‌, మాస్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిపి కొత్త‌ ట్రీట్‌మెంట్ !

ఎస్ఆర్‌టి ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం `నేల టిక్కెట్టు`. రవితేజ సరసన మాళ‌వికా శర్మ హీరోయిన్‌గా నటించారు. మే 25న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో ర‌వితేజ ఇంట‌ర్వ్యూ…

నేను నేల టిక్కెట్ గాడినే…
– ఎన్నో సినిమాలు నేల టిక్కెట్టుపైనే చూశాం. ఇప్ప‌టి త‌రానికి ముందు వారంతా నేల‌టిక్కెట్టుపై సినిమా చూసిన‌వారే. అప్ప‌ట్లో టూరింగ్ టాకీస్‌ల్లో నేల, బెంచి, కుర్చీ టిక్కెట్స్ ఉండేవి. మా అమ్మ‌మ్మ‌గారి ఊర్లో ఒకే ఒక టూరింగ్ టాకీస్ ఉండేది. అక్క‌డ ఇసుక‌లో కూర్చుని సినిమాలు చూసేవాడ్ని. ఆ రోజులే వేరు.

ఇప్ప‌టి త‌రానికి తెలియ‌క‌పోవ‌చ్చు…
– నేల‌టిక్కెట్టు అనే టైటిల్ ఎందుకుపెట్టామ‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది. హీరో క్యారెక్ట‌ర్ చిన్న‌ప్ప‌ట్నుంచి నేల‌టిక్కెట్టువాడిలా ఫీల‌వుతుంటాడు. ఈ జ‌న‌రేష‌న్‌వారికి నేల‌టిక్కెట్ అంటే ఏంటో తెలియ‌క‌పోవ‌చ్చు. చాలా మంది వారి పెద్ద‌వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

అంద‌రికీ న‌చ్చే సినిమా…
– సినిమా అన్ని వర్గాల‌కు న‌చ్చుతుంది. నేల‌టిక్కెట్ ప్రేక్ష‌కుల‌కే కాదు.. బాల్క‌నీ ప్రేక్ష‌కుల‌కు కూడా విజిల్ కొట్టాల‌నిపిస్తుంది. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా మాస్ ట‌చ్‌తో ఉంటుంది. కానీ రెండో మూవీ పూర్తి క్లాస్ ట‌చ్‌తో ఉంటుంది. ఈ మూవీని త‌ను క్లాస్‌, మాస్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిపి తెర‌కెక్కించాడు.

హీరో క్యారెక్ట‌ర్ గురించి…
– ఇందులో హీరో అనాథ‌. ఎవ‌రిని చూసినా త‌న మ‌నిషిగా ఫీల‌వుతుంటాడు. అంద‌రినీ క‌లుపుకు పోతుంటాడు. అలా ఉండ‌టానికి హీరో ఇష్ట‌ప‌డుతుంటాడు. ‘చుట్టూ జ‌నం మ‌ధ్య‌లో మ‌నం’ అనే డైలాగ్‌.. దాని చుట్టూ అల్లిన క‌థ.. సినిమా స్ట్రాంగ్ బేస్ అవుతుంద‌ని అనుకుంటున్నాను.

కొత్త ట్రీట్‌మెంట్‌… 
– క‌థ‌లో  కొత్త‌ద‌నం అని ఉండ‌దు. ట్రీట్‌మెంట్ కొత్త‌గా ఉంటుంది. క‌ల్యాణ్‌కృష్ణ స్టైల్లో ఉంటుంది. క్యారెక్ట‌ర్స్ అన్నీ బావుంటాయి. పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, ఎమోష‌న్స్ అన్నీ మెప్పిస్తాయి.

ఈ సినిమా చేయ‌డానికి కార‌ణ‌మదే..
– సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు సంబంధించిన డైలాగ్స్ కూడా బావుంటాయి. త‌ల్లిదండ్రుల‌ను నిర్ల‌క్ష్యం చేసే కొడ‌కుల‌ను చూసి ఎందుకు బ్ర‌తుకుతున్నార్రా? అనిపిస్తుంది. ఆ పాయింట్ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే.

క‌ల్యాణ్ కృష్ణ గురించి…
– క‌ల్యాణ్ కృష్ణ తొలి సినిమాగా నాతో ఈ సినిమానే చేయాల్సింది. కానీ నాకున్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా అప్ప‌ట్లో సినిమా చేయ‌లేక‌పోయాను. ‘మ‌ధ్య‌లో నీకేదైనా సినిమా వ‌స్తే చేసెయ్!’ అన్నాను. త‌న‌కు ‘సొగ్గాడే చిన్నినాయనా’ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. త‌ర్వాత చైత‌న్య‌తో చేశాడు. మా కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికి కుదిరింది.

గ్యాప్ రావ‌డానికి కార‌ణ‌మ‌దే..
– మంచి స్క్రిప్ట్ ఉంటే ఎవ‌రితో అయినా సినిమా చేస్తాను. యంగ్.. సీనియ‌ర్ అనే తేడాలతో సినిమాలు చేయ‌ను. కొత్త జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్స్ ఎంతో మంది వ‌స్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాలి. మ‌ధ్య‌లో రెండేళ్లు గ్యాప్ రావ‌డానికి కార‌ణం ప్రాజెక్ట్స్ అనుకున్న‌ట్లు సెట్ కాక‌పోవ‌డ‌మే కార‌ణం. త‌ర్వాత ఇప్పుడు వ‌రుస‌గా సెట్ అవుతున్నాయి.

హీరోయిన్ గురించి…
– మాళ‌వికా శ‌ర్మ చ‌క్క‌గా న‌టించింది. త‌న‌కు పాత్ర‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

నిర్మాత రామ్ గురించి..
– రామ్‌తాళ్లూరిగారు ప్రాక్టిక‌ల్ మ‌నిషి. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడుతారు. సినిమాలంటే ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. త‌న‌లో ఈ గుణాలు బాగా న‌చ్చాయి. డ‌బ్బులు సంపాదించాల‌ని ఈ రంగంలోకి రాలేదు. ఆల్‌రెడీ డ‌బ్బులు సంపాదించుకునే ఈ రంగంలోకి వ‌చ్చాడు. ఇలాంటి నిర్మాత‌ల‌తో ఎన్నిసార్లు అసోసియేట్ అయినా త‌ప్పులేదు.

త‌దుప‌రి చిత్రం గురించి..
– విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా గురించి అప్పుడే చ‌ర్చ వ‌ద్దు. ఆ సినిమా విడుద‌ల స‌మ‌యంలో దాని గురించి మాట్లాడుకుందాం. చాలా సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.