`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగవైభంగా కర్టైన్ రైజర్ వేడుక జరిగింది. తాజాగా `మా` విదేశాల్లో సెలబ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హజరవుతున్నట్లు `మా` అద్యక్షుడు శివాజీ రాజా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈవెంట్ ను ‘ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్’- ‘తిరుమల ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్’ సంయుక్తం గా అమెరికాలో నిర్వహిస్తున్నాయి.
శివాజీ రాజా మాట్లాడుతూ… `చిరంజీవిగారికి `మా` వేడుకలు గురించి చెప్పగానే వెంటనే ఒప్పు కున్నారు. ఎక్కడికి రావడానికైనా సిద్దంగా ఉన్నానని హామీ ఇచ్చారు. అలాగే మహేష్ బాబు గారు కూడా మేలో జరిగే ఓ ఈవెంట్ కు వస్తానన్నారు. వీరిద్దరూ మాకు ఎంతో సహాకారాన్ని అందిస్తున్నారు. అలాగే బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నేను చిన్నవాడినైనా ఇండస్ట్రీ నన్ను గుర్తించి..నమ్మి `మా` ప్రెసిడెంట్ పదవిని అప్పగించింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. `మా` కోసం ఎంత కష్టమైనా పడటానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం. ఆ మధ్య కర్టైన్ రైజర్ వేడుకలో నాజర్ గారు `మా` అసోసియేషన్ మాకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆ మాట నాకు ఎంతో ఉత్సాహాన్ని… ధైర్యాన్ని, సంతోషాన్నిచ్చింది. అలాగే పరభాషా హీరోయిన్లు అయినా…మన తెలుగు హీరోయిన్లు అయినా సరే, కచ్చితంగా `మా` లో మెంబర్ షిప్ తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చిందంటే `మా` ముందుకు వస్తున్నారు గానీ, అప్పటివరకూ మేము గుర్తు రావడం లేదు. ఆ సమయంలో ఒక చేత్తో `మా` మెంబర్ షిప్ ఫారమ్…మరో చేత్తో కంప్లైట్ ఫారమ్ తీసుకుని వస్తున్నారు. పరిస్థితి అంతవరకూ తెచ్చుకోవద్దని కోరుకుంటున్నా. అలాగే `మా` సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. `మా` అనుకున్న కార్యక్రమాలన్నింటిని దిగ్విజయంగా పూర్తిచేస్తాం` అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ…` మా’ ఫండ్ రెయిజింగ్ కోసం ఆర్గనైజర్లను కలిస్తే చిరంజీవి గారు వస్తే ఫండ్ ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాల్లో అంతా కలిసి కట్టుగా ఉండి ఏపనైనా చేస్తారు. వాళ్ల అసోసియేషన్ ఆఫీస్ లు చాలా బాగుంటాయి. కానీ మనకు సరైన బిల్డింగ్ కూడా లేదు. అలాంటివన్నీ మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అందరు సహకరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ… ` చిరంజీవిగారు, మహేష్ బాబు గారు `మా` జరిపే కార్యక్రమాలకు పూర్తిగా సహకారం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవం నిన్న జరిగింది. ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు, నేను కూడా వెళ్లాం. ఆ సమయంలో ఆయన ఇలాంటి బిల్డింగ్ మనం కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన అన్నట్లు అది వీలైనంత త్వరలోనే జరుగుతుంది. అలాగే హీరోయిన్లు అందరూ కూడా మెంబర్ షిప్ తీసుకోవాలి. `మా` జరిపే కార్యక్రమాలకు కూడా సహకారం అందించాలి. ఇప్పటికే కొంత మంది సహకారమందిస్తామని మాటిచ్చారు. ఇటీవలే 80 మంది కొత్తగా మెంబర్ షిప్ తీసుకున్నారు` అని అన్నారు.
కార్యవర్గ సభ్యుడు సురేష్ మాట్లాడుతూ… `గతంలో నేను తమిళనాడు ‘నడిగర్ సంఘం’లో పనిచేశాను. ఇప్పుడు `మా` కోసం పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడొస్తున్న హీరోయిన్లలలో ఐదుశాతం మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన 95 శాతం మంది ఫెయిలవుతున్నారు. అలాంటి వాళ్లను ఆదుకోవడం కోసమే `మా` పనిచేస్తుంది. తప్పకుండా అందరూ మెంబర్ షిప్ తీసుకుని `మా` కు సహకరించాలి. అది వాళ్ల బాధ్యత` అని అన్నారు.
అమెరికా ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైనా రాధాకృష్ణ రాజా మాట్లాడుతూ…` డల్లాస్ టెక్సాస్ లో `మా` ఈవెంట్ చేయడం చాలా సంతోషంగా..గర్వంగా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో నభూతో నభవిష్యతి అన్నట్లు ఈవెంట్ ను గ్రాండ్ గా చేస్తాం. అమెరికాలో ఉన్న ఎన్ ఆర్ ఐ లంతా ఈవెంట్ కు హజరవుతారు` అని తెలిపారు.
స్టీఫెన్ పల్లామ్ (అమెరికా) మాట్లాడుతూ…` అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా ఈవెంట్ చేస్తున్నాం. దాదాపు 8000 నుండి10,000 సామర్ధ్యం గల ఆడిటోరియంలో ఈవెంట్ జరగనుంది` అన్ని అన్నారు.
రాంబాబు కల్లూరి (అమెరికా) మాట్లాడుతూ… ` సెలబ్రిటీలను తెరపై చూస్తేనే బోలెడంత సంబరపడిపోతాం. అలాంటిది ఒకే వేదికపై స్టార్స్ ని అందరినీ లైవ్ లో చూపించబోతున్నాం. గతంలో అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదు. భవిష్యత్ లో కూడా ఇలాంటి కార్యక్రమం మరొకటి జరగదేమో! అన్న స్థాయిలో చేయబోతున్నాం` అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిఖిల్ నాంచారి (అమెరికా), `మా` వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, నాగినీడు, సురేష్, అనితా చౌదరి పాల్గొన్నారు.