లాక్‌డౌన్‌లో ‘టాప్‌ టెన్‌ వీడియో’తో…

పంజాబీ బ్యూటీ మెహ్రిన్ కౌర్ టాలీవుడ్ లో బాగానే అవకాశాలు పొందింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ ..ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే, ఆఫర్లు అయితే అందుకుంది కానీ, మెహ్రీన్అందులో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.. ఆ పాత్రల్లో ప్రతిభ చూపించకపోవడంతో ఆమె నటన జనాలకు తొందరగానే బోర్ కొట్టేసింది. ఇక ‘ఎఫ్ టు’ ఘనవిజయం సాధించినా.. అందులో ‘హనీ ఈజ్ ద బెస్ట్’, అంటూ మురిపించినా.. అది ‘యాక్షన్ కు ఎక్కువ..ఓవర్ యాక్షన్ కు తక్కువ’ గా ఉండటంతో ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు.ఆ తర్వాత నాపేరు సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వత్థామ వరుసగా బాక్సాఫీస్ వద్ద ధమాల్ అయ్యేసరికి మెహ్రిన్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆమెకి భవిష్యత్తే ఆశాజనకంగా కనిపించలేదట. ఇక తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది కానీ, అక్కడా ఫలించలేదు . ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో ఆమె కన్నడ చిత్రసీమకు పయనమైందని సమాచారం. కన్నడ నాట నుంచి పిలుపు అందుకోవడంతో ఇప్పుడు అటువైపు దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది మెహ్రీన్. దీంతో పాటూ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట .
మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా!
మెహ్రీన్‌ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. చివరిగా నాగశౌర్య నటించిన ‘అశ్వథ్థామ’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్ లు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన మెహరీన్‌.. తాజాగా ఓ మ్యూజికల్‌ వీడియోలో నటించింది. గాయకుడు ఆర్మాన్‌ మాలిక్‌తో కలిసి ‘జరా.. ఠెహరో’ అంటూ సాగే పాటలో నటించింది. ట్రిగ్గర్‌ హ్యాపీ, డబూ మాలిక్‌ రూపొందించిన ఈ సింగిల్‌ వీడియో సాంగ్‌ని టీ సిరీస్‌ ద్వారా విడుదల చేశారు. ప్రేమికుల విరహాన్ని తెలియజేస్తూ.. ఆద్యంతం మనసులకు హత్తుకునేలా సాగిన ఈ వీడియో సాంగ్‌ని వీక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. యూ ట్యూబ్‌లో ప్రస్తుతం ఇది ‘టాప్‌ టెన్‌ వీడియో సాంగ్స్’లో ఉండటం విశేషం. ‘లాక్‌డౌన్‌లో వచ్చిన ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అంటూ ట్విట్టర్ ద్వారా వీక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది మెహ్రీన్.