ప్లేటు ఫిరాయించినా ఫలితం దక్కింది !

రాజకీయ నాయకుల్లానే బహు భాషా తారలు అవసరాన్ని బట్టి మాట్లాడేసి ఆ తరువాత వివాదాస్పదంగా మారడంతో  ‘అబ్బే తానలా అనలేదు’ అని మాట మార్చేయడం మామూలైపోయింది. ఆ మధ్య నటి తమన్నా ‘బాహుబలి’ చిత్రంతో వెలిగిపోయింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి– 2’ చిత్రంలో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం ఆమెను చాలా నిరాశపరచింది. ఆ తరువాత దక్షిణాదిలో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో బాలీవుడ్‌లో మకాం పెట్టాలని ఆశతో అక్కడ ‘ఇకపై హిందీ చిత్రాల్లోనే నటిస్తానని, దక్షిణాదిలో అవకాశాలు వస్తే ఆలోచిస్తా’నని అనేసింది.
 
ఆ మాటలు తమన్నాను వివాదాల్లోకి లాగాయి. దక్షిణాదిలో వచ్చే అవకాశాలు కూడా వెనక్కి పోయాయట. దీంతో చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డ ఈ అమ్మడు ‘దక్షిణాదిలో అవకాశాలు రావడం లేదని, బాలీవుడ్‌ చిత్రాల్లోనే నటిస్తానని తానెప్పుడూ అనలేద’ని ప్లేట్‌ ఫిరాయించింది. తమన్నా మాట మార్చినా అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది.అదేవిధంగా ఎన్టీఆర్‌తో ‘జై లవ కుశ’ లో లెగ్‌ షేక్‌ చేయడానికి తమన్నా రెడీ అవుతోంది. ఇందుకు భారీ పారితోషికాన్నే పుచ్చుకుంటోందనే టాక్ వచ్చింది . తమిళంలో మాత్రం విక్రమ్‌కు జంటగా ‘స్కెచ్‌’ అనే ఒకే  చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయూర్‌ కాలం’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తోంది.