‘మిల్కీ బ్యూటీ’ ‘బ్లాక్ బ్యూటీ’ అవుతోందా ?

“మంచి మనసు లేకపోతే కనిపించే పై అందం కూడా వ్యర్థమే. తెల్లటి చర్మ రంగు కంటే గొప్ప మనసు మనకు అందాన్నిస్తుంది’ అని అంటోంది తమన్నా. చిత్ర పరిశ్రమలో తమన్నాని ఆమె అభిమానులంతా ‘మిల్కీ బ్యూటీ’ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అలా పిలిచినప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటీ? అని తమన్నాని ఇటీవల మీడియా ప్రశ్నించింది. దీనికి తమన్నా స్పందిస్తూ…
 
“ఈ పదం విన్నప్పుడు నాకేమాత్రం గర్వంగా అనిపించదు. చర్మం రంగును బట్టి మన స్వభావాన్ని, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం నాకు నచ్చదు. నేను ఫెయిర్‌ స్కిన్‌తో జన్మించినప్పటికీ.. నల్లదనాన్నే ఎక్కువగా ఇష్టపడతా. సినిమాల్లో డార్క్‌ తరహా పాత్రల్లో నటించమంటే మరో ఆలోచన లేకుండా ఓకే చేస్తా. నేను అత్యద్భుతంగా ఏదో చేస్తానని కాదు, కానీ సినిమాటిక్‌ ఆలోచనను బ్రేక్‌ చేయాలనుకుంటాను. హీరోయిన్లు ఇలా తెల్లటి చర్మంతోనే ఉండాలనే ఆలోచనలో మార్పు రావాలి. స్కిన్‌టోన్‌ను బట్టి అందాన్ని కొలిచే విధానాన్ని, వారిని ట్రీట్‌ చేసే ధోరణిలో మార్పు రావాలి. ఐదు భిన్న షేడ్స్‌ ఉన్న పాత్రలో త్వరలోనే ప్రేక్షకులకు కనిపించబోతున్నాను. ఆ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్‌” అని చెప్పింది.
 
తెలుపు రంగులో మెరిసిపోయే హీరోయిన్లకు నేడు మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి మిల్కీబ్యూటీ తమన్నా తన అందచందాలు, గ్లామర్‌తో ప్రేక్షకులను మైమరపిస్తోంది. అయితే ఈ భామ కాస్త నలుపు రంగులో కనిపించేందుకు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. ఇప్పుడు రాబోయే రెండు సినిమాల్లో ఆమె ఛామనఛాయలో కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా’లో తమన్నా నటిస్తోంది. దీంతోపాటు ‘దేవి 2’లో కూడా ఆమె హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర ప్రకారం ఆమె కాస్త నలుపు రంగులో కనిపించాల్సి వస్తుందట. దీంతో తనకు కరెక్ట్‌గా సరిపోయే నలుపు షేడ్ కోసం 50 సార్లు లుక్ టెస్ట్ చేసుకొని ఫైనల్‌గా ఒక షేడ్‌కు ఫిక్స్ అయిందట.
 
తమన్నా చేస్తున్న బాలీవుడ్‌ ‘క్వీన్‌’ రీమేక్‌ ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.వెంకటేష్‌ సరసన నటించిన ‘ఎఫ్‌ 2’ చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.