మనం ఉన్నామనే ధైర్యంతో ఉండాలి!

కరోనా మహమ్మారి మనకు ఎన్నో పాఠాలు నేర్పిందంటూ.. తన బ్లాగ్‌లో మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ కొన్ని విషయాలను చర్చించారు..కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతి తగ్గాలంటే లాక్‌డౌన్‌ పొడిగింపు తప్పనిసరి అయిందని.. ప్రజలు సహనంతో ఉండాలని మోహన్‌ లాల్‌ అన్నారు. ’21 రోజుల లాక్‌డౌన్‌ ముగుస్తుంది. మనకు స్వేచ్ఛ వస్తుంది. దూరంగా ఉన్న మన తల్లిదండ్రులను, పిల్లలను కలుసుకోవచ్చు. పనులు, బాధ్య తలు మళ్లీ మొదలవుతాయని అంతా అనుకున్నాం. కానీ అలా జరగలేదు. లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించారు. మనం ఎప్పుడైనా ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. స్వేచ్ఛ కూడా అటువంటిదే. మళ్లీ పనులు మొదలు పెట్టాక ఇక్కడ నుంచి ఎటువెళదాం? ఎక్కడ నుంచి ప్రారంభిద్దాం? మళ్లీ గతంలోలా చేయగలనా? అనే ప్రశ్నలు అందరూ ఎదుర్కొంటారు’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ గ్రీక్‌ రచయిత కథను గుర్తుచేసుకున్నారు… ఆ రచయిత యువకుడిగా ఉన్నప్పుడు భారీ కుండపోత వర్షానికి తన ద్రాక్ష తోట అంతా నాశనమైపోయింది. ఆ సమయంలో ఆ రచయిత తన తండ్రితో ‘మనమంతా కోల్పోయాం కదా నాన్న’ అంటే ఇటువంటి అనేక సవాళ్లను తన జీవితంలో ఎదుర్కొన్న ఆ రైటర్‌ తండ్రి.. ‘కానీ మనం మాత్రం మిగిలే ఉన్నాం కదా’ అని సమాధానం చెప్పారని గుర్తుచేశారు. ‘మళ్లీ స్వేచ్ఛ వచ్చాక ..మనం ఉన్నామనే ధైర్యంతో ఉండాలి. మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం కచ్చితంగా ఓపిక పట్టాలి. ఈ సవాళ్లను మనం కచ్చితంగా అధిగమిస్తాం’ అని మోహన్‌ లాల్‌ పేర్కొన్నారు.
 
త్వరలో మోహ‌న్ లాల్ బ‌యోగ్రఫీ
‘ది కంప్లీట్ యాక్ట‌ర్‌’గా పిల‌వ‌బ‌డే మోహన్ లాల్ భారతదేశం గర్వించదగ్గ నటులలో ఒక‌రు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే…మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలోని నటుడిని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. ఆ మధ్య ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ మనసులకు దగ్గరయ్యారు మోహ‌న్ లాల్ . జాతీయ స్థాయిలో ఐదు పుర‌స్కారాలు అందుకున్న మోహ‌న్ లాల్ ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డులు అందుకున్నారు. భాను ప్ర‌కాశ్ అనే ర‌చ‌యిత మోహ‌న్ లాల్ ప్రొఫెష‌న‌ల్ , పర్స‌న‌ల్‌తో పాటు మ‌రిన్ని కోణాల‌ని ‘ముక్కార‌గం’ అనే పుస్త‌కం ద్వారా ఆవిష్క‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మోహ‌న్ లాల్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపాడు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ బ‌యోగ్రఫీ బుక్‌కి సంబంధించి వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా.. త్వరలో దీనిని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురానున్నారు.
 
మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం ‘ఇట్టిమాని: మేడ్‌ ఇన్‌ చైనా’ అనే చిత్రం చేస్తున్నారు. జిబి అండ్‌ జోజు ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో పురాతన క్రిస్టియన్ నృత్యాల‌లో ఒకటైన ‘మార్‌క్కంగళి’ డ్యాన్స్‌ చేసే త్రిసూర్‌ ప్రాంత వాస్తవ్యుడిగా మోహన్‌లాల్ క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు సిద్ధిఖీ ద‌ర్శ‌క‌త్వంలో ‘బిగ్ బ్ర‌ద‌ర్’ అనే సినిమా చేయ‌నున్నాడు మోహ‌న్ లాల్. ఇందులో స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు