మోహనరావు దురికి ‘బతుకు’ లఘు చిత్రానికి ప్రథమబహుమతి

 మోహనరావు దురికి రచించి దర్శకత్వం వహించిన ‘బతుకు’ లఘు చిత్రానికి స్టూడియో వన్ ఛానల్ నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ప్రథమ బహుమతి అందుకుంది. ఈ పోటీలో పాల్గొన్న వందలాది లఘు చిత్రాలను స్టూడియో వన్ ఛానల్ ప్రతిరోజూ ఒకటి చొప్పున ఏడాదిపాటు ప్రసారం చేసింది. ఈ నెల 22 తేదీ సాయంకాలం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, స్టూడియో వన్ ఛానల్  అధినేత అప్పారావు, యువ దర్శకుడు విశ్వనాధ్ ఈ ప్రధమ బహుమతిని  మోహన రావు దురికి అందించారు.
 అవార్డు గ్రహీత  మోహనరావు దురికి మాట్లాడుతూ….. లోగడ ‘బతుకు’ లఘు చిత్రానికి అమెరికా, చైనా, కెనడా సంయుక్తంగా నిర్వహించే ‘గోల్డెన్ పాండా’ అవార్డుల పోటీలో పాల్గొని, ప్రపంచ వ్యాప్తంగా 36 ర్యాంక్ వచ్చిందనీ, ఇండియా నుంచి ఎన్నికైన ఏకైక లఘు చిత్రం  ‘బతుకు’ అని చెప్పారు. అంతేకాదు గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ఈ చిత్రానికి ప్రథమ బహుమతి, ఉత్తమ  దర్శకుడి అవార్డులు వచ్చాయని చెప్పారు. ఇప్పటివరకు 12 అంతర్జాతీయ బహుమతులు వచ్చిన ఈ చిత్రాన్ని చూసి ముంబాయిలో వున్న ‘చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఇండియా’ పిలిచి ఒక కమర్షియల్ సినిమా తీయమని దర్శకుడిగా అవకాశం ఇచ్చిందనీ, త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, వి. సముద్ర, వి. ఎన్ .ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.