మనకు మనమే స్నేహితులం…నాకు నేనే అండ !

మూడు పదుల వయసును అధిగమించిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దంన్నర దాటేసింది. అయినా హీరోయిన్‌గా ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఇప్పటికీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు ఉండడం విశేషమే. మోహిని, గర్జన వంటి చిత్రాలతో యాక్షన్‌ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది.

ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ‘కొడి’ చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు మోహిని, గర్జన, అరవిందస్వామికి జంటగా ‘చతురంగవేట్టై 2′, విజయ్‌సేతుపతి సరసన ’96’, ‘1818’ అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వంటి పలు కారణాల వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన ‘మోహిని’, ‘గర్జన’, ’96’ చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట.

ఈ సందర్భంగా స్నేహితులు, మనస్తాపం వంటి విషయాల గురించి త్రిష ఒక భేటీలో పేర్కొంటూ.. జీవితంలో అనునిత్యం చాలా మందిని కలుసుకుంటుంటాం. ‘నా ఎదురుగా వచ్చే చాలా మంది చెయ్యి పైకి ఎత్తి హాయ్‌ అంటూ పలకరిస్తుంటారు. వారిలో కొంతమందితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారిలో కొందరు స్నేహితులుగా మారతారు. అయితే ఎంత స్నేహితులైనా వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోలేం.

అందుకే ప్రతి రోజు ఒకసారి మనకు మనమే హలో చెప్పుకోవాలి. ఎందుకంటే… మనకు మనమే స్నేహితులం. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నా వరకూ ఏదైనా మనస్తాపం కలిగినప్పుడు ఏకాంతం కోరుకుంటాను. ఆ సమయంలో అసలు ఎందుకు సమస్య వచ్చింది? అని నన్ను నేనే ఆత్మపరిశీలన చేసుకుంటాను. ప్రేమాభిమానాలు కురిపించే కుటుంబం, మంచి స్నేహితులు ఉండవచ్చు. అయితే నాకు నేనే అండ అని అంటోంది’ హీరోయిన్‌ త్రిష.