నిర్మాతగా మారాలని.. దర్శకత్వం చెయ్యాలని…

కొన్నేళ్ళ జైలు జీవితం  సంజయ్ దత్ ని  అందరూ మరచిపోయేలా చేసింది. 
ఇక ‘మున్నాభాయ్’ పనైపోయిందనుకుంటున్న తరుణంలో పడి లేచిన కెరటంలా తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘భూమి’ చిత్రంతో ఆయన తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. సంజయ్ దత్ తిరిగి తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ …..

“నేను రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ‘భూమి’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం తర్వాత చాలా సినిమాలు చేయబోతున్నాను. అందులో భాగంగానే త్వరలో ‘మున్నాభాయ్’ సీక్వెల్‌ను ప్రారంభించబోతున్నాం. అలాగే ‘సాహెబ్‌ బివి ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌ 3’, ‘తోడ్‌ బాజ్‌’, ‘మలాంగ్‌’తోపాటు అజయ్ ప్రొడక్షన్స్‌లో, ఫర్హాన్‌ ప్రొడక్షన్స్‌లో పలు సినిమాలకు సైన్‌ చేశాను. ఇక వరుసగా నా సినిమాలు వస్తాయి. నటుడిగానే కాదు నిర్మాతగా మారాలనుంది. పలు భిన్నమైన, కంటెంట్‌ ప్రధాన చిత్రాలను నిర్మిస్తాను. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తాను. దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. మున్ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించాలనుంది.

నన్ను చాలా విధాలుగా మార్చింది !

నాకిష్టమైన చిత్రాల్లో ‘లగేరహో మున్నాభాయ్’ ఒకటి. ఈ సినిమా నా జీవితాన్ని చాలా విధాలుగా మార్చింది. ఈ చిత్రంలో నటించడం ద్వారా గాంధీజీ గురించి తెలుసుకున్నాను. ఆయన గొప్ప వ్యక్తి ఎలా ఆయ్యారో తెలిసింది. దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నా పాత్రతో పాటు వినోదం బాగా పండాయి. దర్శకుడు బ్యూటిఫుల్‌ వేలో సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇలాంటి సినిమా తీయడం కేవలం రాజ్‌కుమార్‌ హిరానీకే సాధ్యమవుతుంది. త్వరలో ఈ చిత్రానికి మూడో సీక్వెల్‌ను తెరకెక్కించాలనే  ప్రయత్నం జరుగుతోంది. అందుకొక గొప్ప కథ దొరికింది. ప్రస్తుతం దానిపై దర్శకుడు హిరానీ వర్క్‌ చేస్తున్నారు. కేవలం మున్నాభాయ్’ అనేదే కాదు. దీంతోపాటు ”వాస్తవ్‌’, ‘సాజన్‌’, ‘సడక్‌’, ‘ఖల్‌నాయక్‌’, ‘కాంతి’ వంటి చిత్రాలు కూడా నాకిష్టమైనవే.

గర్వంగా ఫీలవుతున్నాను !

నాపై బయోపిక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ బయోపిక్‌ రావడం పట్ల నాకు అభ్యంతరం గాని, భయం గానీ లేదు. ఎందుకంటే ఇక్కడంతా ఓపెన్‌. నా జీవితం గురించి అందరికి తెలుసు. అయితే రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో నా బయోపిక్‌ రావడం పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. అదే నాకు పెద్ద అంశం. ఈ చిత్రంలో నా పాత్రలో రణబీర్‌ కపూర్‌ నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రణబీర్‌ మంచి నటుడు. అయితే రణబీర్‌ కపూర్‌ వర్క్‌ పట్ల నేను సంతృప్తిగా లేనని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. నా పాత్రను పండించడం కోసం తను చాలా హార్డ్‌వర్క్‌ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇదొక గొప్ప చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నా. ఈ చిత్రం నన్ను కీర్తిస్తూ ఉంటుందని అనుకోవడం లేదు. అలా ఉండాలని కోరుకోవడం లేదు. ఇదొక రియల్‌ స్టోరీని చెప్పే చిత్రం మాత్రమే.