‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ అధ్యక్షునిగా ఎన్‌. శంకర్‌

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం’ ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్‌.శంకర్‌ గెలుపొందారు. ఎన్‌.శంకర్‌తో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్‌.రవి కుమార్‌ చౌదరి, ఎస్‌.వి.భాస్కర్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్‌.ఎస్‌.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా  డీవీ రాజు(కళింగ), ఎన్‌ గోపీచంద్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్‌ అడ్డాల, అనిల్‌ రావిపూడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్‌ రెడ్డి విజయం సాధించారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతుంది.

దేశస్థాయిలో తలమానికంగా తీసుకొస్తాం ! 

‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగాయి. ఎన్‌.శంకర్‌, సానా యాదిరెడ్డి అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. 759 ఓట్లకి గానూ ఎన్‌.శంకర్‌కి 518 ఓట్లు పోల్‌ అయ్యాయి. ప్రత్యర్థిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్‌.శంకర్‌ అధ్యక్షుడిగా గెలుపొందారు. సానా యాదిరెడ్డి ప్యానల్‌ నుండి ఇ.సి మెంబర్స్‌గా పోటీ చేసిన తొమ్మిదిమంది సభ్యుల్లో కృష్ణమోహన్‌ ఒక్కరే విజయం సాధించారు.

ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ…. ‘‘మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరాటమిది. దర్శకుల సంఘాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను అధ్యక్షుడిగా నిలబడ్డా. నన్ను, నా ఆశయాన్ని నమ్మి గెలిపించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. కొత్త, పాత దర్శకులంతా నాకు సపోర్ట్‌ చేశారు. అసిస్టెంట్‌, అసోసియేట్‌, కో-డైరెక్టర్‌ ఇలా దర్శకుల శాఖలో అందరి సలహా, సూచనలు తీసుకుని సత్వరమే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం. రెండేళ్ల సమయంలో డైరెక్టర్‌ అసోసియేషన్‌ ప్రతిష్ఠని దేశస్థాయిలో తలమానికంగా తీసుకొస్తాం’’ అని అన్నారు. ఎన్‌.శంకర్‌ ప్యానల్‌లో గెలుపొందిన సభ్యులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌’ డైరెక్టర్‌ అని దర్శక స్థానానికి గుర్తింపు తీసుకొచ్చిన దర్శకరత్న దాసరి నారాయణరావును తలచుకుని జోహర్లు అర్పించారు.