ఆకట్టుకోని ఫీల్ గుడ్ మూవీ.. ‘థాంక్యూ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ 2.25/5

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  విక్రం కుమార్ దర్శకత్వం లో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ…  ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కుర్రాడు అభిరామ్ (నాగ చైతన్య). అక్కడ రావు అంకుల్ (ప్రకాష్ రాజ్), ప్రియ (రాశీ ఖన్నా) అభిరామ్ కు అండగా నిలుస్తారు. వైద్య అనే యాప్ తయారు చేసి అభిరామ్ వ్యాపారవేత్తగా పేరు, డబ్బు గడిస్తాడు. ఈ క్రమంలో ప్రియతో ప్రేమలో పడతాడు. వీళ్లు సహజీవనం సాగిస్తుంటారు. తను అనుకున్నది సాధించాక, తనొక్కడి వల్లే ఇదంతా సాధ్యమైందనే భ్రమలో పడిపోతాడు అభిరామ్. టీమ్ వర్క్ కు విలువ ఇవ్వడు, గుడ్డిగా లక్ష్యం వైపు సాగుతుంటాడు. ఎదిగాక అభిలో వచ్చిన మార్పు ప్రియ తట్టుకోలేకపోతుంది. అభిరామ్ గొప్ప స్థాయికి వచ్చేందుకు సాయపడిన వాళ్లను గుర్తు చేస్తుంది. దీంతో అంతర్మథనంలో పడిపోతాడు అభి. తన మూలాలను, తను నడిచొచ్చిన దారిని వెతుక్కుంటూ సొంతూరు వస్తాడు. అతని గతమేంటి, ఆ గతంలో పార్వతీ (మాళవికా నాయర్)తో ప్రేమ, శర్వా (సాయి సుశాంత్ రెడ్డి)తో వైరం ఎలాంటి ముగింపునకు చేరాయి? అనేది సినిమాలో చూడాలి…

విశ్లేషణ…  జీవితంలో సాధించే విజ‌యాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారితో  భావోద్వేగ ప్ర‌యాణ‌మే ‘థాంక్యూ’ సినిమా.  భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు, సెట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేకుండా.. ఎమోష‌న్స్‌ను ప్ర‌ధానంగా చేసుకుని న‌డిచే సినిమా . నాగ చైత‌న్య చుట్టూనే ‘థాంక్యూ’ సినిమా నడిచింది. ఓ ముప్పై ఐదేళ్ల వ్య‌క్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య ద‌శ‌ల‌ను ఈ సినిమా రూపంలో మ‌లిచారు. ఇప్పుడు మనం చేరిన  గమ్యానికి సాయపడిన వారెందరో ఉంటారు. వాళ్లను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి, ‘థాంక్స్’ చెప్పాలి అనే పాయింట్ బాగుంది. అయితే ,భావోద్వేగంగా  ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని యూనిట్ చేసిన ప్ర‌య‌త్నం ఓకే. కానీ, సినిమా బావున‌ట్లే ఉంటుంది కానీ.. ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుడు మాత్రం క‌నెక్ట్ కాడు. మంచి పాయింట్ ని ఎక్జిక్యూట్ చేయడంలో శ్రద్ధ వహించకపోవడం వల్ల… చాలా విషయాల్ని తేలిగ్గా తీసుకోవడం వల్ల ఫలితం ఆశించినట్టు రాలేదు.  ‘మ‌నం’ వంటి ఎమోష‌న‌ల్ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించిన విక్ర‌మ్ కుమారేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసింది? అనే సందేహం కలుగుతుంది.

నటీనటులు…  అభిరామ్ పాత్రలో నాగ చైతన్య నటన మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో టీనేజ్ కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. ఈ గెటప్ లో చైతూ సహజంగా కనిపించాడు. అలాగే కాలేజ్ సీన్స్ లో, హాకీ ప్లేయర్ గా అతని బాడీ లాంగ్వేజ్ ‘ప్రేమమ్’ ను గుర్తు చేస్తుంది. ప్రియ క్యారెక్టర్ కు రాశీఖన్నా న్యాయం చేసింది. ఆమె పాత్రలోని భావోద్వేగాలు పండాయి. పార్వతి  పాత్రలో మాళవికా మరో కీ రోల్ చేసింది. ప్లాష్ బ్యాక్ లో ఆమె క్యారెక్టర్ నాగచైతన్యతో పాటు నడుస్తుంది. నిడివి తక్కువైనా ప్రకాష్ రాజ్ పాత్ర బరువైంది. కథలో కీలకమైంది. హీరోకి చెల్లెలు వరస పాత్రలో అవికా గోర్ పర్వాలేదు. శర్వాగా చేసిన సాయి సుశాంత్ లో ఈజ్ ఉంది. ఈశ్వరీరావు, సంపత్ క్యారెక్టర్స్ బాగున్నాయి.

సాంకేతికం…  ఇలాంటి సినిమాల్లో సంభాషణలకి చాలా స్కోపుంటుంది. కానీ అత్యంత దయనీయమైన, పేలవమైన డైలాగ్స్ రాసుకున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్. అద్భుతమైన విజువల్స్‌తో మంచి ఫీల్‌ను కలిగించారు. యూఎస్ ను అందంగా చూపించిన ఆయన ఫ్రేమ్స్, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పల్లెటూరి వాతావరణాన్ని కలర్ ఫుల్ గా తెరకెక్కించారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో ఎమోషన్ క‌నెక్ట్ కావాలంటే సంగీతం ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాలి. థమన్ సంగీతం లో ఒక్క పాట మినహాయించి మిగిలిన పాటలు గానీ, నేపథ్య సంగీతం కానీ గొప్ప‌గా లేవు  -రాజేష్