ఆకట్టుకోని.. నాగ‌శౌర్య ‘అశ్వథ్థామ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5 

ఐరా క్రియేష‌న్స్‌ బ్యానర్ పై ర‌మ‌ణ‌తేజ‌ దర్శకత్వంలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… గ‌ణ‌(నాగ‌శౌర్య‌) అమెరికా నుండి యు.ఎస్‌కి చెల్లెలి నిశ్చితార్థం కోసం వ‌స్తాడు. పెళ్లికి రెండు రోజుల ఉంద‌న‌గా ప్రియ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటుండ‌గా అడ్డుకుంటాడు. త‌న‌కు తెలియ‌కుండానే తాను గ‌ర్భ‌వ‌తిని అయ్యాన‌ని.. ఇంట్లో తెలిస్తే గొడ‌వ అవుతుంద‌ని చెల్లెలు చెప్ప‌డంతో..అన్న‌గా ఆమెకు అండ‌గా నిల‌బ‌డి కాబోయే బావ‌(ప్రిన్స్‌) సాయంతో అబార్ష‌న్ చేయిస్తాడు. త‌ర్వాత వారిద్ద‌రికీ పెళ్లి చేస్తాడు. కానీ అస‌లు త‌న చెల్లెల‌కు ఏం జ‌రిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. సిటీలో త‌న చెల్లెలిగా లాగానే కొంత మంది అమ్మాయిలు మాయ‌మ‌వుతున్నార‌ని, వారంద‌రూ మ‌ళ్లీ ఇళ్ల‌కు తిరిగి వ‌స్తున్నార‌ని.. అయితే వారు గ‌ర్భ‌వ‌తులు అవుతున్నార‌ని తెలుస్తుంది. దాంతో అస‌లు ఇదంతా చేస్తున్న‌దెవ‌రు? అనే విష‌యాన్ని ప‌సిగ‌ట్టాల‌నుకుంటాడు. ఇన్వె స్టిగేష‌న్‌ ప్రారంభిస్తాడు. ఇన్వె స్టిగేష‌న్‌లో ఐదుగురు వ్య‌క్తులు కిడ్నాప్‌లు చేస్తున్నార‌నే నిజం తెలుస్తుంది.అస‌లు కిడ్నాప్‌ల‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి ఎవ‌రు? విష‌యాన్ని గ‌ణ ఎలా క‌నుక్కుంటాడు? అనేవి తెలియాలంటే సినిమాలో చూడాలి…..

విశ్లేషణ… లవ‌ర్‌బోయ్‌గా ఎక్కువ సినిమాల్లో క‌న‌ప‌డ్డ నాగ‌శౌర్య తొలిసారి డిఫ‌రెంట్‌గా చేసిన ప్ర‌య‌త్నం ‘అశ్వ‌థ్థామ‌’. హీరోగానే కాదు.. ర‌చ‌యిత‌గా తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే, కథలోని పాయింట్ బాగున్నా.. చాలా చోట్ల కథనం స్లో అవటం, ‘రాక్షసుడు’ పోలికలు  కనపడటంతో చూసేవాళ్లకు  చికాకు పుట్టిస్తుంది. కథ మొదటి నలభై నిముషాలు వరకూ కేవలం కాలక్షేపం… ఇంటర్వెల్ మరో ఇరవై నిముషాలు ఉందనగా వేగం పుంజుకుంది. ఇంటర్వెల్ సైతం బాగానే చేసారు. సెకండాఫ్ స్టార్టింగ్ బాగున్నా ..మెల్లిమెల్లిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తగ్గిపోతూ క్లైమాక్స్ చేరుకుంది. కిడ్నాప్‌ల కి అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడం పెద్ద ఇబ్బంది. హీరో ఫ్యామిలీ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ బోరింగ్‌.. ‘ఎప్పుడు అయిపోతుందిరా బాబూ’ అనేలా ఉన్నాయి.సిస్ట‌ర్ సెంటిమెంట్ అని చెప్పుకున్న ఈ సినిమాలో కేవలం ఒక‌ట్రెండు సీన్స్‌లో బ్ర‌ద‌ర్, సిస్ట‌ర్ స‌న్నివేశాలున్నాయి . అయితే, అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ అంతగా పండలేదు. హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి.సినిమాలో కిడ్నాప్‌లు ఎవ‌రు చేయిస్తార‌నే కీ పాయింట్ ఇంట‌ర్వెల్ త‌ర్వాత రివీల్ అయిపోతుంది. దాంతో సినిమాలో ఉన్న కిక్ పోతుంది.సినిమాలో ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే అంబులెన్స్ సీన్‌, ఫైట్ మిన‌హా సినిమాలో గొప్ప‌గా చెప్పుకోడానికి ఏమీ క‌న‌ప‌డ‌దు.
 
నటవర్గం… నాగ‌శౌర్య సిక్స్ పాక్య్ లుక్ తో కనిపించి పెర్ఫామెన్స్ ప‌రంగా బాగా చేశాడు. కొన్ని సీన్లలలో కాస్త క్లాస్‌ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్‌ మాస్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో కనిపిస్తాడు. మెహరీన్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడంలో తడ బడుతూ..నటించే విషయం మరిచిపోయినట్లుంది .పాట‌ల‌కు ప‌రిమిత‌మైంది. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన జిష్షు సేన్ గుప్తా న‌ట‌న బావుంది. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. పోసాని చిన్న సీన్‌లో చేసినా ప్రాణం పోశాడు. హీరో చెల్లి పాత్ర చేసిన సర్గన్ కౌర్, ప్రిన్స్ ,జ‌య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌, సత్య బాగా చేసారు
సాంకేతికం… ఈ సినిమాకు ప్రధాన బలం జిబ్రాన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. కొన్ని సీన్లలో సైలెంట్‌ మ్యూజిక్‌.. మరికొన్ని చోట్ల హార్ట్‌ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాడు. శ్రీచరణ్‌ పాకాల పాట‌లు అంత బాగాలేవు .మనోజ్‌ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్‌ అందాలు, యాక్షన్‌ సీన్లలో మనోజ్‌ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు.సినిమాలో వచ్చే డైలాగ్‌లు కొన్ని ఆలోచించే విధంగా ఉంటాయి. ఈ చిత్రంలో అన్బు, అరివు యాక్షన్ చెప్పుకోదగ్గ అంశం. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ లో మెయిన్ విలన్ తో ఫైట్ సీన్ ఆకట్టుకుంది. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ బాగుంది – రాజేష్