వాయించి వదిలేసింది ! ….’నర్తనశాల’ చిత్ర సమీక్ష

                                             సినీవినోదం రేటింగ్ : 1.5/5
ఐరా క్రియేష‌న్స్‌ పతాకం పై శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వం లో ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే…
చ‌నిపోయిన త‌న భార్య కొడుకు క‌ళామందిర్ క‌ల్యాణ్‌(శివాజీ రాజా)కి కూతురుగా పుడుతుంద‌ని అత‌ని తండ్రి అనుకుంటాడు. తండ్రి కోరిక నేర‌వేరాల‌ని క‌ల్యాణ్ కూడా అనుకుంటాడు కానీ, వారికి మ‌గ పిల్లాడు  (నాగ‌శౌర్య‌) పుడ‌తాడు. హార్ట్ పేషెంట్ అయిన తండ్రి కోసం కొడుకును కూతురుగా పెంచుతాడు. పెద్ద‌యిన త‌ర్వాత మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఇచ్చే విద్య‌ల్లో ట్ర‌యినింగ్ ఇస్తుంటాడు. స‌న్యాసి కావాల‌నుకునే అమ్మాయి మేఘ‌న‌(కశ్మీర ప‌ర‌దేశి)ని కొన్ని ప‌రిస్థితుల నుండి హీరో కాపాడుతాడు. దాంతో మేఘ‌న హీరోతో ప్రేమ‌లో ప‌డుతుంది. అలాగే రాయుడు అమ్మాయి స‌త్య‌భామ‌(యామినీ భాస్క‌ర్‌) కూడా హీరోని చూసి ప్రేమ‌లో ప‌డుతుంది. క‌ల్యాణ్ స‌త్య‌భామ‌ను త‌న కొడుకు ప్రేమిస్తున్నాడ‌ని అర్థం చేసుకుని …ఆమె తండ్రితో సంబంధం క‌లుపుకోడానికి వెళ‌తాడు. పెళ్లి నిశ్చ‌య‌మైన త‌ర్వాత కొడుకు, మేఘ‌న‌ని ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకుంటాడు. కానీ రాయుడుని ఎదిరించ‌లేడు. ఆ స‌మ‌యంలో మ‌న హీరో తాను ‘గే’ అని.. అందుకే స‌త్య‌భామ‌ను పెళ్లి చేసుకోలేన‌ని చెబుతాడు. కానీ అస‌లు స‌మ‌స్య అక్క‌డే మొద‌ల‌వుతుంది. హీరో, హీరోయిన్‌కి ఎదురయ్యే స‌మస్యేంటి? హీరో ఆ స‌మ‌స్య‌ను ఎలా దాటుతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో  చూడాల్సిందే…
 
సమీక్ష…
‘ఛలో’ సినిమాతో  ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే.. ఏర్పడ్డ  అంచనాలు అందుకోవటంలో నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి  నాగశౌర్యని కొత్తగా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ పండలేదు. హీరో పాత్ర‌ను స‌రిగ్గా డిజైన్ చేయ‌లేదు.లవర్ బాయ్ ఇమేజ్‌ ఉన్న నాగశౌర్య ‘గే’ తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది.  కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాదాసీదాగా నడిపించాడు. సినిమా ఫ‌స్టాఫ్ లో అస్స‌లు ల‌వ్‌, ఇత‌ర ఎమోష‌న్స్ ఏవీ క‌నెక్ట్ కావు…. ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలను తప్పి  నిరాశపరుస్తుంది.దర్శకుడు కథను పేపర్ మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆయన రెండవ భాగం కథనం పై  శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
నటీనటులు …
నాగశౌర్య గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు.  రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించాడు. ఒక‌టి నార్మ‌ల్ క్యారెక్ట‌ర్ అయితే.. మరొక‌టి గే పాత్ర‌. తన పాత్రకి ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనల ద్వారా అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేసాడు.ఇక కథానాయకిగా నటించిన కశ్మీరా పరదేశి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో…  అలాగే మరో హీరోయిన్ తెలుగు అమ్మాయి యామిని భాస్కర్ తన అందంతో అభినయంతో  ఆకట్టుకున్నారు.యామిని భాస్కర్ ఓ పాట‌లో అందాలు ఆర‌బోసింది.హీరో తండ్రి పాత్రలో నటించిన శివాజీ రాజా కాస్త అతిగా అనిపించినా… తన కెరీర్ లో గుర్తు పెట్టుకునే పాత్ర చేశారు.    ఇక జ‌య‌ప్రకాశ్ రెడ్డి రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో మాట్లాడుతూ చేసిన కామెడి.. రాకెట్ రాఘ‌వ తాగుబోతుగా చేసిన కామెడీకి న‌వ్వుతారు. అజ‌య్ గే పాత్ర‌లో చేసినా.. త‌నపాత్ర రొటీన్ విల‌న్‌గానే మారిపోయింది. జయ ప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, ఉత్తేజ్‌ బాగాచేసారు.
సాంకేతిక వర్గం…
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాని ఆయన చాలా అందంగా చూపించారు.  హీరో హీరోయిన్ల మధ్య సాగిన సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగుంది. ‘ఛలో’ సినిమాకు  హైప్‌ రావటంలో హెల్ప్‌ అయిన సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాతో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్‌లో మాత్రం లేవు. రెండు పాట‌లు.. వాటి పిక్చ‌రైజేష‌న్స్ ఆక‌ట్టుకున్నాయి.  అలాగే స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది.సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అయింది. అయితే  కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేది -రాజేష్